వాస్తవికత పునాదుల మీద రాయలసీమ కథాసౌధం

  సింగమనేని నారాయణ
  నాగరికతకు మూలాధారం నీళ్లు, రాయలసీమలో లేనివి నీళ్లే. నీళ్లున్న ప్రాంతాల వాళ్లకు నీళ్లు లేని ప్రాంతాల వాళ్ల ఈతి బాధలు చెబితే తప్ప అర్థం కావు. ఒక కడివెడు నీళ్లకోసం మైళ్లకు మైళ్లు నడవాల్సి రావటం, గంటల తరబడి పడిగాపులు కాయటం, నీళ్లు చాలక పైర్లు ఎండిపోవడం, వర్షాలు కురువక భూములు బీళ్లుగా ఉండిపోవడం, కళ్లారా చూస్తే తప్ప ఆ విషాదం హృదయాన్ని తాకదు. కుటుంబ జీవనం మొదలుకొని, దేశ జీవనం వరకూ ఆర్థికాన్ని శాసించేది, నాగరికతను తీర్చిదిద్దేవి నీళ్లే. తర తరాలుగా రాయలసీమ వాసులు నీళ్ల కోసం తరించిపోవటాన్ని సంఘసంస్కర్తలూ గుర్తించలేదు. రాజకీయ నాయకులు చలించలేదు. నీళ్లు భూమికగా ఈ తరం రచయితలు శరీరం గగుర్పొడిచే, హృదయాలు కంపించే ఎన్నో కథలు రాశారు.
    ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, నాటికల్లాంటివి రాయలసీమలో చాలా ఆలస్యంగా ప్రారంభంకావటాన్ని చాలా మంది గుర్తించే వుంటారు. 1910-45 మధ్యకాలం నాటికే కోస్తాంధ్రప్రాంతంలో తెలుగు కథానిక వస్తువులోనూ, రూపంలోనూ కూడా గొప్ప వికాసం పొంది వుండగా, ఆ థలో రాయలసీమలో కథానికే ఆవిర్భవించకపోవటం కొంత వింతగా అనిపిస్తుంది. ఇందుకు కారణాలు చాలానే వున్నాయి. రాయలసీమలో ఆధునిక జీవితం చాలా ఆలస్యంగా ప్రారంభం కావటమే ఇందుకు అసలు కారణమనిపిస్తుంది. పారిశ్రామిక వాతావరణం,ఆధునిక విద్య, భాష, రాజకీయాలూ, ఉద్యమాలూ క్రమంగా చోటు చేసుకుంటున్న థలోనే ఆధునిక భావజాలం, ఆధునిక జీవితం, పరివ్యాప్తమైతాయి. నదీ జలాలు సమృద్ధిగా ఉండటం, వాటి వినియోగం, వ్యవసాయం కూడా పరిశ్రమగా పరిణమించటం, స్త్రీ విద్య, పత్రికలూ, రవాణా సౌకర్యాలూ ఈ క్రమంలో ఆధునికత ప్రారంభమౌతుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో 19వ శతాబ్ధి మధ్యభాగం నాటికే కృష్ణాబ్యారేజీ నిర్మాణం, నదీజలాల వినియోగం, వ్యవసాయ సంబంధాలలో మార్పులూ, ఈ క్రమంలో తెలుగుదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఆ ప్రాంతం అభివృద్ధి శీఘ్రతరమై ఉండటాన్ని గుర్తించవచ్చు! ఆ కారణంగానే అక్కడ ఆధునిక విద్య సంఘసంస్కరణోద్యమాలూ, రాజకీయాలూ, చిన్నపాటి పరిశ్రమలూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే ముందుగా నెలకొన్నాయి.
    గిడుగు, గురజాడలు వ్యావహారిక భాషోద్యమాన్ని నడుపుతున్న కాలంలో రాయలసీమ వాసులకు వ్యావహారిక భాష అంటే ఏమిటో తెలియదు. గురజాడ కన్యాశుల్కం రాసే నాటికి, రాయలసీమలో ఇంకా సంప్రదాయ కవితే రాజ్యమేలుతుంది. గురజాడ ముత్యాలసరాలు కూర్చేనాటికి రాయలసీమ కవులకు మాత్రాబద్ధ చందస్సులో గేయకవితా ప్రక్రియే తెలియదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే పత్రికలూ, ఆధునిక విద్య బాగా అందుబాటులోకి రావటం వల్ల రాయలసీమ ప్రాంతంలో ఆధునిక సాహిత్య సంచలనం మెల్లగా ప్రారంభమైంది.
    రాయలసీమ రచయితలు భాష విషయంలో ఎదుర్కొన్న అసౌకర్యం కూడా ఇందుకు ఒక కారణం! అంతవరకూ సాహిత్య ప్రయోజనాలకు ఉపకరిస్తున్న గ్రాంధిక భాష ఆధునిక కథానికకు బొత్తిగా ఉపయోగపడదు. తమ ప్రాంతపు మాండలిక భాష పట్ల తమకే అనుమానం. దీనికి సాహిత్య గౌరవం లభించదేమోనన్న భయం! ఇక కథ రాయటానికి కొత్తగా ఒక భాషను నేర్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అప్పటికే పత్రికా భాషగా, రచనా భాషగా స్థిరపడివున్న కోస్తాంధ్రభాషను నేర్చుకొని కథలు రాయాల్సిరావటం వల్ల కూడా, రాయలసీమలో కథావేగం కొంత మందగించింది. అందువల్ల శ్రీపాద, దీక్షితులు, కుటుంబరావు, గోపీచంద్‌, బుచ్చిబాబు, పద్మరాజులాంటి కథకులు, ఆయా ప్రాంతాలలో విరివిగా కథలు రాస్తున్నకాలంలో రాయలసీమలో చెప్పుకోదగ్గ రచయిత ఒక్కడైనా లేడు. ఆ కారణంగా స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమలో ఆధునిక కథానిక దాదాపు లేనట్టే! స్వాతంత్య్రానంతరమే రాయలసీమలో కథానిక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుందని మనం భావించవచ్చు!
    ఆలస్యమైనప్పటికీ రాయలసీమలో కథానిక విషయంలో మంచి ప్రారంభమే జరిగింది. కె.సభాగారిని రాయలసీమ తొలితెలుగు కథకుడిగా గుర్తించవచ్చు! మధురాంతకం గారి మాటల్లో చెప్పాలంటే, 'రెండు బండల మధ్యగల నెరియలో నుంచి అంకురించి తన ఉనికి కోసం మనుగడ కోసం, ప్రకృతితో పోరాడే రావిమొక్కలా ఎదిగి శాఖోపశాఖల మహావృక్షంగా విస్తరిల్లిన రచయిత కె.సభాగారు'
    సభాగారు చిత్తూరుజిల్లాలో కథలు ప్రారంభించేకాలం నాటికి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుండి కథలు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవు. సభాగారి వారసత్వాన్ని స్వీకరించి, చిత్తూరు జిల్లాలో కథారచన సాగించిన వారు మధురాంతకం రాజారాంగారు. రాజారాంగారు తన కథలకు ఒక సొంపైన భాషను తయారు చేసుకున్నారు. కొంత గ్రాంధిక వాసన, కొంత శిష్ట వ్యావహారికం, కొంత మాండలికం కలగలిసిన సుందరమైన భాష రాజారాంగారిది. ఆయన కథలు రాసేకాలం నాటికి రాయలసీమలో ఆయనకు మార్గదర్శకులైన రచయిత ఒక సభాగారు మాత్రమే! ఆయనంత విరివిగా కథలు రాసిన రచయితలు ఇప్పటికీ రాయలసీమలో లేరు. గ్రామసీమల గురించి రాజారాంగారు రాసినన్ని కథలు బహుశా తెలుగులో ఏ రచయితా రాయలేదేమో! రాయలసీమ ప్రాంతీయ జీవిత వాసన వారి కథల్లో గుబాళిస్తూ వుంటుంది. చిత్తూరు జిల్లా ప్రాంతీయ విలక్షణతను ఆయన కథల్లో మనం దర్శించవచ్చు. ఆయన రాసిన ఎడారికోయిల, కూనలమ్మకోన, సర్కస్‌డేరా, జీవన్ముక్తుడు, జీవన ప్రహాసనం లాంటి అనేకానేక కథల్లో స్పష్టమైన ప్రాంతీయ ముద్రను గమనించవచ్చు... ఆయన కథనశైలి మౌఖికశైలిలా ఉండటం ఒక ప్రత్యేకత. ఈ శైలితో ప్రభావితులై రచనలు చేసిన వారిలో కేశవరెడ్డిగారిని చెప్పుకోవచ్చు.
    రాయలసీమలో కథలు రాస్తున్నవారిని సౌలభ్యం కోసం స్థూలంగా రెండు తరాలుగా మనం విభజించుకోవచ్చు.1955-65 థకంలో కథలు రాయటం ప్రారంభించిన మొదటితరం రచయితలైతే, 1975-85 థకం నుంచి కథలు రాస్తున్నవారు రెండవతరం రచయితలు - ఇది ఒక చిన్న రేఖావిభజన మాత్రమే. మొదటితరం రచయితల్లో కె. సభా,మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, పులికంటి, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, వల్లంపాటి, ఆర్‌.వసుంధరాదేవి, బి. నాదమునిరాజు, రా.రా. సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి, పి. రామక్రిష్ణారెడ్డి, వై.సి.వి. రెడ్డి మొదలగువారు చేరుతారు.
రెండవతరం రచయితల్లో డా. కేశవరెడ్డి, డా|| లంకిపల్లె, మధురాంతకం నరేంద్ర, మహేంద్ర, నామిని, వీరపల్లె వీణావాణి, వి.ఆర్‌ రాసాని, సింగమనేని, దేవపుత్ర, స్వామి, శాంతినారాయణ, సన్నపురెడ్డి, పాలగిరి విశ్వ ప్రసాద్‌, దాదాహయత్‌, తుమ్మల రామకృష్ణ, రాప్తాడు గోపాలకృష్ణ, సుందరరాజు మొదలగువారు వస్తారు. వీరిలో ఇటీవల కథారచన ప్రారంభించిన వారు కూడా కొందరు లేకపోలేదు.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, మొదటితరం రచయితలు దాదాపు లేరనే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో జి. రామకృష్ణ  అనే జర్నలిస్టు 1943 ప్రాంతంలో చిరంజీవి  అన్న చిన్న కథనూ, 1952 ప్రాంతంలో గంజికేంద్రం అన్న ఒక వాస్తవిక జీవన కథను రాశారు. అయితే ఆయన ఆ తర్వాత, ఒకటి రెండు కథలు మాత్రమే రాసి విరమించుకున్నారు.
విచిత్రమేమిటంటే, రాయలసీమలో కథలు రాస్తున్నవాళ్లంతా దాదాపుగా బ్రహ్మణేతరులు కావటం! గ్రామీణ ప్రాంతాల నుండీ, శ్రమజీవన కుటుంబాల నుండీ వచ్చినవాళ్లు కావటం. రాయలసీమలో తరతరాలుగా సంప్రదాయ సాహిత్యాన్ని సృష్టించిన బ్రాహ్మణులు ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశించకపోవటం! కోస్తాంధ్రలో కథా రచయితలందరూ గురజాడ మొదలుకొని, పురాణం వరకూ ఏ కొద్దిమందినో మినహాయిస్తే, అందరూ బ్రాహ్మణులు కావటం, రాయలసీమలో కథా రచయితలందరూ దాదాపు బ్రాహ్మణేతరులు కావటం, ఇదొక విచిత్రసన్నివేశం! ఇందుకు కారణాలు పరిశోధకులు అన్వేషించాల్సివుంది!
రాయలసీమ తొలితరం రచయితలు, వస్తువుతోపాటు, కథా నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తను కనబరిచారు. కొడవటిగంటితో ప్రభావితులైన, రా.రా., సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి లాంటి కథకులు నిరాడంబరమైన, నిరలంకారమైన శైలిలో కథలు రాశారు. అనవసరమైన వర్ణనల జోలికి పోకుండా, అనవసరమైన నాటకీయతను చొప్పించకుండా, కథలో పెద్ద మలుపులు లేకుండా, సూటిగా చెప్పటం వీరి కథాశిల్పంలోని ప్రత్యేకత. పాత్రల స్వభావాలను రచయితలే పనిగట్టుకొని చెప్పకుండా, వారి ప్రవర్తన, సంభాషణల ద్వారా వ్యక్తీకరించటం, కథా రచనలో వీరు పాటించిన సంయమనం - చిత్తూరు జిల్లా కథకులశైలి వీరికంటె భిన్నమైనది. సుందరమైన, లలితమైన పదాల పోహళింపుతో, మనోజ్ఞమైన వర్ణనలతో, పొందికైన వాతావరణం మధ్య వయ్యారంగా నడుస్తుంది. వీరి రచనా శైలి, అయితే వస్తువును మింగివేసే శైలీవైవిధ్యాన్ని వీళ్లెవరూ ప్రదర్శించలేదు. రాయలసీమ వాసులకు సహజమైన బోళాతనం వీరి శిల్పంలో కన్పిస్తుంది. నుడికారాలూ, సామెతలూ, లోకోక్తులూ, వీళ్ల కథల్లో విరివిగా చోటు చేసుకున్నాయి. ఈ తరం రచయితలెవ్వరూ తమ కథల్లో మాండలిక భాష పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరచకపోవటం గమనార్హం. కొందరైతే మాండలిక భాషాఛాయలు అసలు కన్పించకుండా జాగ్రత్తపడటం కూడా కనిపిస్తుంది. అందుకు కారణం తమ భాషపట్ల తమకే ఎక్కడో న్యూనతాభావం ఉండటం. పత్రికా భాషను నూటికి నూరుపాళ్ళూ ప్రామాణిక భాషగా ఆమోదించటం.
రెండవతరం రచయితలు కథలు రాసేనాటికి, రాయలసీమలో చెప్పుకోదగ్గ మార్పులు చాలానే వచ్చాయి. స్కూళ్లూ, కాలేజీలూ, బహుళ సంఖ్యలో పెరిగాయి. సెకండరీస్థాయి వరకూ ఉచిత విద్య లభించటం వల్ల మధ్య తరగతికి విద్య అందుబాటులోకి వచ్చింది. ప్రతి పల్లెకూ కరెంటు వచ్చింది. పల్లె పల్లెకూ రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. కపిల మోటల స్థానంలో కరెంటింజన్లు వచ్చాయి. కొంతకాలం గడిచేసరికి గొట్టం బావులు వచ్చాయి. ఇంతకు మునుపు శ్రమను పెట్టుబడిగా మార్చి పంటలు పండించే  రైతులు ఇప్పుడు డబ్బును పెట్టుబడిగా చేసి వ్యవసాయం చేయటం వల్ల క్రమంగా చితికిపోతున్నారు. డబ్బు చేతిలో వుంటే తప్ప సేద్యం చేయటం సాధ్యంకాని పరిస్థితి వచ్చింది. ఈ థలోనే రైతులకు వాణిజ్య పంటలపట్ల ఆసక్తి పెరిగింది.  భూమికి విలువపెరుగుతూ వచ్చింది. బీడుగా వున్న వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. చిరకాలంగా ఉన్న వ్యవసాయేతర కులాలు వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టాయి. భూమి చేతులు మారింది ఈ థలోనే. ఉత్పత్తి పెరిగింది. అయితే ఉత్పత్తి చేసే రైతు పరిస్థితి రాను రాను దయనీయంగా మారటం జరుగుతున్న పరిణామం! ఇందుకు తోడు ప్రతి రెండు మూడు సంవత్సరాలకూ ఇక్కడ కరువు కరాళనృత్యం చేస్తూనే ఉంది. బావులు ఎండిపోయాయి. బోరింగులూ, గొట్టపుబావులు లేని రైతే ఇప్పుడు లేడు. తాగునీటికి అంతటా ఎద్దడి ఏర్పడింది. రైతులు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితులు ఇట్లా వుండగా పల్లెల్లో ఓట్ల రాజకీయాల జోరు క్రమంగా పెరిగింది. ఓట్ల కోసం రాజకీయ నాయకులు అమాయకపు పల్లెల్ని రెండు వర్గాలుగా చీల్చటం ప్రారంభించారు. కులం మునుపెన్నడూ లేనంతగా పడగవిప్పింది. ఫ్యాక్షన్‌ పెరిగింది. ముఠాలు పెరిగాయి. వ్యక్తిగతంగా సైన్యాన్ని నడుపుకొనే ఫ్యాక్షన్‌ రాజకీయ వేత్తలు  పుట్టుకొచ్చారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలలో పల్లెలు అగ్నిగుండాల్లా మారిపోసాగాయి. బాంబుల పేరు తెలియని మారుమూల పల్లెటూళ్లలో కూడా దీపావళి బాణసంచాల్లా బాంబులు పేలుతున్నాయి. ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో చిక్కుకుని చాలా కుటుంబాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోనయితే ఇళ్లు బూడిదయ్యాయి. ఈ ఫ్యాక్షన్‌ నాయకులకు అండగా  ఒక లంఫెన్‌ కిరాయిగూండావర్గం పెరగసాగింది. మద్యం చాలా సహజమైన పానీయమైపోయింది. కమ్యూనిస్టు భావజాలం ప్రజలపై ప్రభావాన్ని చూపటం తగ్గిపోసాగింది.
ఈ రాయలసీమ సామాజిక చిత్రాన్ని రెండవతరం కథా రచయితలు, తొలితరం కథకులతోపాటుగా, ఒక క్రమపరిణామంతో తమ కథల్లో చిత్రించుకుంటూ వస్తున్నారు. మారుతున్న రాయలసీమ సామాజిక సంక్లిష్ట పరిస్థితుల మధ్య కొన్ని కొత్త వస్తువులను ఈ కథకులు కథల్లో తీసుకు వచ్చారు. ప్రాకృతికంగా రాయలసీమ అనుభవిస్తున్న భౌగోళిక దురన్యాయాన్ని తమ కథల్లో చిత్రించటం ప్రారంభించారు. కరువు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య పంటలు పండకపోవడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటం, దళారీల దోపిడీ ఇవన్నీ  కథావస్తువులయ్యాయి. రాయలసీమ ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక లక్షణాలను ఈతరం రచయితలు స్పష్టంగా గుర్తించారు.
స్వామి రాసిన నీళ్లు, వానరాలే కథలూ, దాదాహయాత్‌ రాసిన గుక్కెడు నీళ్లు, సన్నపురెడ్డి రాసిన తడి, కేతువిశ్వనాథరెడ్డి రాసిన వానకురిస్తే, నమ్ముకున్న నేల, సింగమనేని రాసిన ఊబి, విముక్తి, చక్రవేణు రాసిన కసాయికరువు, శాంతి నారాయణ రాసిన కల్లమయిపాయ, మహేంద్రరాసిన ప్రతిజ్ఞ లాంటి ఎన్నో కథలు ఈ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.
కుటుంబంలోని సంబంధాలలో కూడా నీళ్లు వహించే పాత్రను ఎంతో వాస్తవికంగా, చక్కని శిల్పంతో, స్వామి తన నీళ్లు కథలో చిత్రించాడు. ఒక మధ్యతరగతి ఉద్యోగి కుటుంబ కేంద్రంగా స్వామి ఈ కథను నడిపాడు. వాళ్లు నివసించే చిన్న పట్టణంలో తాగే నీళ్లు, వచ్చేది రోజుకు ఓ గంటసేపు మాత్రమే. అవీ ఏ సాయంత్రమో ఏ అర్ధరాత్రో, తెల్లవారు జామునో వస్తాయి. ఇంట్లో ఆడవాళ్లు జీవనదృష్టి అంతా ఈ నీళ్ళరాకమీదనే!  అవి వచ్చినపుడు కూడా తమ భాగానికి ఏ రెండు మూడు బిందెలు మాత్రమే లభిస్తాయి. వాటికోసం వీధిలో పడిగాపులు. ఆ నీళ్లనే రోజంతా ఎంతో పొదుపుగా వాడుకోవాలి. భోజనాలకు కూచునేటప్పుడు తట్టముందు, తాగేనీళ్లు ఒక చెంబులో వుంచుకుంటారు ఆ కుటుంబీకులు.చేతులూ తట్టలూ కడుక్కోనేందుకు ఉప్పునీళ్ళు (బోరింగునీళ్లు) మరో చెంబులో వుంచుకుంటారు. పొరపాటున తాగేనీళ్లతో, చేతులూ, మూతీ, కడుక్కున్నారో, ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళతో చేసేది ఒక చిన్నసైజు యుద్ధమే! ఒకపూట వాళ్ల పిల్లాడు పొరపాటున తాగేనీళ్లతో చేయికడుక్కోవటం తల్లి చూసింది. ఇంకేముంది. ఎడంచేత్తో ధనాధనా వాని చెంపల్నీ, వీపునీ, తలనీ, ఎక్కడబడితే అక్కడ ఉతికేసింది' ఆ పిల్లాడు 'అమ్మా! లేదమ్మా! ఇంక ఒలకపోయనమ్మా' 'అంటూ నోరంతా వెల్లబెట్టి ఏడుస్తావుంటే, ఆ తల్లికూడా వాణ్ణి కౌగిలించుకొని భోరునఏడ్చేసింది. ఈ దృశ్యాన్ని ఏ ప్రాంతం రచయిత రాయగలడు? ఇదంతా ఒక ఎత్తయితే నీళ్ళకోసం, నీళ్ల పేరుతో, ఓట్ల కోసం నడిపే రాజకీయాలు ఒక ఎత్తు, వీధి కుళాయి దగ్గర తలలు పగులగొట్టుకొనే వాతావరణం మరో ఎత్తు. ఆ కథ ముగింపు వాక్యం గమనించండి. 'ఎవరు ఎన్ని నీళ్లు వాడతారో తెలిస్తే వాళ్ల, నాగరికత ఏ పాటిదో చెప్పెయ్యవచ్చు! తాగేదానికి ఒక కడవ నీళ్లు నోచుకోనివారికి ఏం నాగరికత వుంటుంది?''....
దాదాహయాత్‌ రాసిన గుక్కెడు నీళ్లు కథ గమనించండి. ఒక ముసలిదాని దాహార్తి తీర్చడానికి ఒక పదేళ్ల పసిపిల్ల చెంబుడు నీళ్లకోసం, రెండు మైళ్లు నడిచి, ఒక కోనేరులో చెంబు ముంచబోయి జారిపడి, ఆ కోనేరులో చచ్చిపోయిన దారుణ దృశ్యం గుండెల మీద గుండు ఎత్తుతుంది. ఈ కథలో వినిపించే ఒక వీధిపాటగాడి తంబూరా పాటను పరిశీలించండి. 'గుక్కెడు' నీళ్ళు కోసం బొక్కేవులేరా సిద్ధా..! దక్కేనా నీరూ సిద్ధా... ఇలాంటి పాటను తంబూరా మీద పాడే పాటగాళ్లు, వేరే ఏ ప్రాంతంలోనైనా ఎందుకుంటారు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన తడి కథ ఇదే సమస్యను మరికొంత దూరం తీసుకుపోతుంది. ఈ కథలోని సమస్య సాగునీటి సమస్య! అయితే ఈ కథ నీటి సమస్య దగ్గర ఆగిపోదు. ఎంతో సన్నిహితంగా, ఆత్మీయంగా ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య వాళ్ల కుటుంబాల మధ్య గల సహజమైన ప్రేమ సంబంధాలను నీటి సమస్య ఎలా ఛిద్రం చేస్తుందో ఈ కథ చూపెడుతుంది.
రాయలసీమ రైతు, అనేకానేకంగా, ఈ సమస్యల్ని ఎలా అనుభవిస్తున్నాడో, ఎలా సతమతమవుతున్నాడో తెలియచెప్పే కథలు ఈ థలో అనంతంగా వచ్చాయి. ఒక్క వానకురిస్తే చాలు తండ్రీ! బతికి బయటపడతాము అనుకుంటూ ఆకాశంలో మబ్బులకేసి చూసే అమాయక రైతు ఎదురుచూపులను వానకురిస్తే కథలోనూ, వానలు కురవక... పంటలు పండక, అప్పుల భారం భరించలేక, తాను నమ్ముకున్న నేల తన్ను దగా చేస్తే, దాన్ని తెగనమ్ముకున్న రైతు నిస్సహాయవేదనను తాను నమ్ముకున్న నేల కథలోనూ చూడవచ్చు. మడికి తడిపెట్టడానికి నీళ్లు చాలక, అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు అప్పుచేసి, బోరువేయిస్తే, నీళ్లకు బదులు బండపడి, విలవిలలాడి పోయిన, చిన్నకారు రైతు దయనీయ స్థితిని సింగమనేని నారాయణ రాసిన ఊబి కథలో గమనించవచ్చు. కరువు కరాళ ద్రష్టలకు చిక్కి, మేపటానికి గడ్డిలేక పశువులను కసాయివాళ్లకు అమ్ముకున్న బీభత్సాన్ని చక్రవేణు కసాయి కరువులో దర్శించవచ్చు.
రాయలసీమ రైతుకు పండే పంటలు అంతంతమాత్రం ! తీరా దాన్ని అమ్మబోతే ఎలాంటి మోసానికి, దోపిడీకి గురౌతున్నాడో తెలియచెప్పే కథలు కూడా ఈ థలోనే వచ్చాయి. శాంతినారాయణ రాసిన దళారీ, సింగమనేని రాసిన అడుసు లాంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. శాంతి నారాయణ దళారీ కథలో, ఒక మధ్య తరగతి రైతు తాను పండించిన ఉల్లి గడ్డలను  మార్కెట్‌కు తోలితే మార్కెట్‌ వ్యాపారులు, లారీ బ్రోకర్‌ ఆఫీస్‌ వాళ్లు, ఒక పద్ధతి ప్రకారం ఎలా దగా చేస్తారో, ఔరా ! ఎంత మోసం.. అనిపించే తీరులో చాలా సహజంగా చెబుతాడు. పండించిన చీనీకాయలకు గిట్టుబాటు ధర లభించకపోగా, మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకుపోయిన రైతు నిరాశా నిస్పృహలకు లోనై, తాను పెంచి పోషించిన చీనీ చెట్లను తానే నరికి వేసుకున్న రైతు ఆత్మ విధ్వంస గాధను సింగమనేని అడుసు కథలో అక్షరీకరిస్తాడు.
ఇంకా రాయలసీమ రైతు అంతరంగాన్నీ అతనికి భూమితో గల అనుబంధాన్నీ, అతడి జీవన విన్యాసాన్ని, ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించిన కథలు వర్తమాన థాబ్దంలో చాలానే వచ్చాయి. దేవపుత్ర మన్నుతిన్న మనిషి. పులికంటి బంగారు సంకెళ్లు డా. లంకిపల్లె జీవనం, కేతు విశ్వనాథరెడ్డి  గడ్డి, సన్నపు రెడ్డి  కొత్త దుప్పటి, స్వామి వానరాలే... ఇలా ఎన్నయినా ఉదహరించవచ్చు. రాయలసీమ రైతు జీవన సంచలనాల్ని చిత్రించిన 18 మంది కథకుల కథలు గల సీమ కథలు సంకలనం ఈ థలోనే వెలువడింది.
రాయలసీమ కథకులలో, రచనా, వ్యాసంగం చేపబట్టిన ప్రారంభదినాల నుండీ, రాయలసీమ సామాజిక మూలాల్ని, ప్రత్యేక సాంస్కృతిక లక్షణాలనూ, విడవకుండా తన కథల్లో చిత్రిస్తూ వస్తున్న కథకుడు కేతు విశ్వనాథరెడ్డి గడ్డు జీవన వాస్తవికతను తన కథల్లో ప్రతిభావంతంగా ఆవిష్కరించటం ఆయన ప్రత్యేకత! పల్లెపట్టులను గురించి రాసినా, పట్టణ జీవితాన్ని గురించి రాసిన, నగర నాగరికతల్ని గురించి రాసినా వాటి మూలాలు, వేర్లు. పల్లెపట్టుల్లోనే దాగి ఉండటం విశ్వనాధరెడ్డి కథల్లోని విశిష్టత.
గ్రామీణ జీవనం పట్ల, రైతాంగం పట్ల, ఆర్తితో, అనుకంపనతో రాసిన ఎందరో కథకులు ఈ థలో పుట్టుకురావటం విచిత్రం! రైతాంగం గ్రామీణ జీవనం, వస్తువుగా, అసంఖ్యాకమైన కథలు రాయలసీమ నుండే ఎక్కువగా రావటంలోని, వర్తమాన చారిత్రక సందర్భాన్ని ప్రత్యేకంగా గమనించాల్సి వుంది. ఈ చిత్రణంతా ఒక కోణం అయితే, మరోకోణం రాయలసీమలోని ముఠాకక్షలూ, ఫ్యాక్షనిజం, హింసా రాజకీయాలు ! అవి జన జీవితంలో సృష్టిస్తున్న అలజడీ, సంక్షోభమూ! వీటిని కథల్లో చిత్రించడానికి సామాన్యమైన అనుభవమూ, ప్రతిభాచాలదు. తొలితరం కథకులైన వై.సి.వి. రెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి గార్లు రెండు థాబ్దాల కిందటే రాయలసీమ ముఠాకక్షల నేపథ్యంలో రాసిన కథలు గమనించదగ్గవి. వై.సి.వి. రెడ్డి ఐదు రూపాయలు కథలోనూ, విశ్వనాధరెడ్డి కూలిన బురుజు కథలోనూ ఈ ఛాయలు మనం  చూడవచ్చు.
ముఖ్యంగా కడపజిల్లా ఈ ఫ్యాక్షన్స్‌కు పెట్టిందిపేరు. కడప అంటేనే రాష్ట్రంలో చాలా ప్రాంతాల వాళ్లకు బాంబులే గుర్తుకువస్తాయి. ఒక కుటీర పరిశ్రమగా బాంబుల తయారీ కడప జిల్లాలో విస్తరించిందంటే అతిశయోక్తి మాత్రం కాదు. సామాజిక ఆధిపత్యం కోసం జరుగుపోరులో ఒక కులం ఆ జిల్లాల్లో ఫ్యాక్షన్‌కు కేంద్రమైంది. కడప జిల్లా కథకులు ఆ ముఠా కక్షల్ని కేవలం ఒక స్టంటు కథగా చిత్రించిన వాళ్లు కాదు. అందుకు గల ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలను కూడా తమ కథల్లో వివరించే ప్రయత్నం చేయటం ఆ కథకుల విశిష్టత.
పాలగిరి విశ్వప్రసాద్‌ రాసిన 'కరువూ వచ్చె కచ్చలూ వచ్చె'' కథ కడప జిల్లాలోని గ్రామ కక్షలకు సాక్షమిచ్చే కథ ! వర్షాలు లేక ఒక  ప్రక్క పైర్లు ఎండిపోతూ వుంటే, ఆ ఎండిన పైరును, మరో ప్రక్క దొంగగొడ్లు మేయటానికి ప్రయత్నిస్తూ వుంటాయి. కనీసం ఆ పైరునైనా రక్షించుకోవటానికి గ్రామస్తులు కాపలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. ఆ గ్రామం మొదటి నుండి కక్షలకు నిలయం! అందరూ కలసి ఏర్పాటు చేసుకున్న ఆ సమావేశంలో మాటా మాటా పెరిగి పాతకక్షలు భగ్గుమంటాయి. బాంబులు పేలుతాయి. హత్యలు జరుగుతాయి. కేసులౌతాయి. అసలు సమస్య గాలికి పోయి ఒకర్ని ఒకరు చంపుకోవటమే లక్ష్యంగా చెలరేగుతారు. కక్షలకూ కరువుకూ గల సంబంధాన్ని ఈ కథలో కథకుడు వివరించే ప్రయత్నం చేస్తాడు. ఈ కథచివర రామిరెడ్డి భార్య వీళ్ళ కక్షా రాజకీయాలను అసహ్యించుకుంటూ వేసిన ప్రశ్నల్లో రచయిత కంఠస్వరం వినిపిస్తుంది. జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన మంచి కథ ఇది!
దాదాహయాత్‌ రాసిన 'సెగమంటలు' పట్టణ జీవితంలోకి విస్తరించిన ముఠా కక్షల్ని చిత్రించిన కథ, ఫ్యాక్టరీ కక్షలు, రాజకీయ కక్షలుగా మారటం, వాటి మధ్య సామాన్య పౌరులు నలిగిపోవటం ఇందులోని ఇతివృత్తం ! ఇదే రచయిత రాసిన ఏటి ఒడ్డున చేపలు కథలో, పెన్నేటి ఒడ్డున కాపురముంటూ, పెన్నేటిలో కరిబుజకాయలు పండించుకునే ఒక పెద్ద కుటుంబం, ఆ గ్రామంలోని కక్షల మధ్య అన్యాయంగా ఇరుక్కుపోయి, అక్కడ నుండి పారిపోయిన దీన దృశ్యం కనిపిస్తుంది. వారసత్వం కథ, తండ్రుల నుండీ పిల్లలకు బాంబుల సంస్కృతి వారసత్వంగా ఎలా సంక్రమిస్తుందో చూపెడుతుంది. ఈ మూడు కథల్లో ఫ్యాక్షన్‌ కారణంగా అందులో సంబంధమే లేని సామాన్యుల జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో రచయిత చిత్రించాడు. ఇంకా డి. రామచంద్రరాజు రాసిన ఏటిదరిమాను కథలో కూడా ఇలాంటి వాతావరణాన్నే గమనించవచ్చు. పి. రామకృష్ణారెడ్డి రాసిన ఎదిగే పెద్దోళ్లూ - నలిగే సన్నోళ్లు కథ చాలా స్పష్టంగా కడపజిల్లా ముఠా కక్షల్ని అందులో బలియైపోతున్న బలహీన వర్గాల ఆక్రోశాన్ని ప్రతిబింబించింది. అనంతపురం జిల్లాలో ఇటీవలి కాలంలో ఫ్యాక్షనిస్టులు సామాజిక శాసనకర్తలుగా మారుతున్న వైనం ఆ జిల్లా జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించిన వారికి అర్థమౌతుంది. ఈ ఫ్యాక్షనిస్టులు తమకు సైన్యంగా ఎలాంటి వాళ్ళన్ని చేరదీస్తున్నారో స్వామి రాసిన నడక కథ హేతుబద్ధంగా వివరిస్తుంది. సోమరితనమూ, వ్యసనాలు వున్న ఒక వర్గం ఈ ఫ్యాక్షన్‌ వలయంలోకి ఎలా ఆకర్షింపబడుతున్నదో ఈ కథ వివరిస్తుంది. ఈ ఫ్యాక్షనిస్టుల్లో ఒక ముఠా తమ కార్యకలాపాలకు విప్లవం రంగు పులుముకోవటం ఆశ్చర్యమనిపిస్తుంది. ఫ్యాక్షనిస్టుల వల్ల, వాళ్ళ స్వంత కుటుంబాల్లోని స్త్రీలు సైతం ఎలాంటి మానసిక అశాంతికి సాంఘిక అసౌకర్యానికి గురౌతున్నారో శాంతినారాయణ రాసిన గర్భస్రావం కథలో గమనించవచ్చు. ఈ మధ్యనే కర్నూలు జిల్లా నుండి ఫ్యాక్షన్‌ కథలు అన్న పేరుతో, మూడు కథల చిన్న సంకలనం వచ్చింది. తుమ్మల - రామకృష్ణ, శ్రీనివాసమూర్తి, రాప్తాడు గోపాలకృష్ణ రాసిన ఈ కథల్లో, గ్రామీణ వాతావరణంలో కుటుంబ సంబంధాలలో, ఎలాంటి అవాంఛనీయ ధోరణులు ఈ ఫ్యాక్షనిజం కారణంగా విస్తరిస్తున్నాయో మనం చూడవచ్చు. ఇటీవలే వచ్చిన మధురాంతకం రాజారాం గారి గాలి వీడు నుండీ న్యూయార్క్‌ దాకా అన్న కథ చిత్తూరు జిల్లా ఫ్యాక్షనిజం నేపథ్యంలో రమణీయంగా నడచిన కథ.
రాయలసీమ ప్రత్యేక సామాజిక అంశాలతో కథలు రాసిన వారిలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ మంచి రచయిత నామిని. ఆత్మకథా మాలికలుగా నామిని ఈ కథాచిత్రాలు చిత్రించినప్పటికీ, కథాశిల్పానికి అతని కథలు ఒదగకపోయినప్పటికీ,  చిత్తూరు జిల్లా గ్రామీణ జీవనంలోని, శ్రమజీవన సౌందర్యము, కళాత్మకమైన నిర్మాణంతో, పాఠకుణ్ణి ముగ్ధుణ్ణి చేస్తాయి. ఇంకా పులికంటి కృష్ణారెడ్డి ,వీరపల్లె వీణావాణి, మహేంద్ర, నరేంద్ర, వి.ఆర్‌. రాసాని, డా|| లంకిపల్లె రాసిన కథల్లో స్థలకాలల చైతన్యాన్ని మనం గమనించవచ్చు. నరేంద్ర రాసిన అత్యాచారం, కాకులూ, గ్రద్ధలూ, నాలుగుకాళ్ళ మంటపం కథలూ, మహేంద్ర రాసిన ముసలమ్మ మరణం కథలూ, ఆ ప్రాంతపు జీవితాన్ని పాఠకుడి ముందు పరుస్తాయి. డా|| లంకిపల్లె రాసిన కథలన్నీ కూడా వ్యావసాయిక జీవితానికి సంబంధించినవే కావటం ఒక విశేషం.
దళితవాదం తెలుగు కథా సాహిత్యంలో వేరూనుకుంటున్న ఈ థలోనే, రాయలసీమ నుండీ ఈ ధోరణితో ప్రత్యేక ప్రాదేశిక లక్షణాల నేపథ్యంలో మంచి దళిత కథలు పుట్టుకొచ్చాయి. కేవలం వాదం కోసం అల్లిన కథలుగా కాకుండా సామాజిక మూలాల నుండి త్రవ్వి తీసిన కథలుగావటం వీటి ప్రత్యేకత. మాల మాదిగల శ్రమ జీవన మూలాల నుండే, అగ్రకులాల ఆస్తులూ, ఆరోగ్యమూ అభివృద్ధి చెందుతున్నాయని సన్నపురెడ్డి చనుబాలు కథలో, వర్తమాన గ్రామ జీవిత నేపథ్యంలో వివరిస్తాడు.  బి.సి.లను కూడా  దళితులుగా సంభావించటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది. స్వామిరాసిన ప్రశాంతం కథ.... ఒక హరిజనుడు మంత్రి అయినప్పటికీ అగ్రవర్ణాల చెప్పుచేతల్లో ఉండటంలోని అనివార్యతను నిరూపిస్తుంది. శాంతినారాయణ ఉక్కుపాదం కథ... రాయలసీమ పల్లెల్లో హరిజనులకు ఇప్పటికీ దేవాలయ ప్రవేశంలో  అస్పృశ్యతను అగ్రవర్ణాలు పాటించటాన్ని వివరిస్తుంది సింగమనేని మకర ముఖం కథ. ఇంకా దేవపుత్ర రాసిన విలోమం, ఔషధం, సమిధలు కథలూ, స్వామి రాసిన తల్లిమట్టి, హెచ్‌. సరస్వతి కథలూ, సన్నపురెడ్డి అంటు, పాలగిరి విశ్వప్రసాద్‌ చెప్పుకింద పూలు, దాదాహయాత్‌ ఎల్లువ చెప్పుకోదగ్గ మంచి కథలు... ఈ మధ్యనే వచ్చిన నాగప్పగారి సుందరరాజు రాసిన మాదిగోడు కథలు ప్రత్యేకంగా పరిశీలించాల్సిన చక్కని కథలు. కర్నూలు జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతపు  మాదిగల జీవితాన్ని ఆత్మీయంగా, కళాత్మకంగా ఆవిష్కరించిన ఆత్మకథా చిత్రిమాలికలు అవి ! రాయలసీమ నుండి వచ్చిన దళిత కథలన్నీ కూడా, నిర్దిష్ట స్థల కాలాలతో ముడిపడి వుండటం గమనార్హం ఒక వాదం పట్ల ప్రచార దృష్టి లేకుండా, వాస్తవికతా పునాదులతో, కళాత్మకతకు భంగం కలగకుండా ఈ కథలు వుండటం వాటి గొప్పతనం.
రాయలసీమ కథలకు నేడు తెలుగు కథా సాహిత్యంలో ఒక ఆమోదయోగ్యమైన విశిష్టస్థానం ఉన్నది. రాయలసీమ కథకులందరూ మట్టివాసనను అనుభవించినవారు. నేల మీద పాదాలు మోపి నడుస్తున్న వాళ్లు. అతివాద ధోరణులకూ, అవాస్తవిక చిత్రణలకూ, కేవలం కాల్పనిక సృజనకూ అలవాటు పడినవాళ్లు కారు. ఇక్కడ కథా రచన వ్యాపారమయంకాలేదు. సామాజిక సంస్కారతృష్ణ కలిగినవారు, వస్తువు వల్ల మాత్రమే కాదు. కళాత్మకంగా విశ్వసనీయత లోపించకుండా, క్లుప్తత పాటిస్తూ, సంయమనంగా కథలు రాయటం వల్లనే రాయలసీమ కథను ఈనాడు పాఠకులూ, విమర్శకులూ ఆహ్వానిస్తున్నారు.
రాయలసీమ కథకులు స్పృశింపని సామాజిక రంగాలు కొన్ని మిగిలివున్నాయి. పారిశ్రామిక రంగం గురించీ, రాజకీయ రంగం గురించీ ఇక్కడి కథకులు కథారచనను ఇంకా ప్రారంభించవలసి వుంది. ఇంకా స్పష్టమైన కంఠస్వరాన్ని వర్తమానంలో రాస్తున్న యువకథకులు సాధించాల్సి వుంది. సామాజిక వాస్తవికతకు దూరం గాకుండా, తెలుగు కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేయటంలో రాయలసీమ కథకుల పాత్ర ఎంతో విశిష్టమైనదీ, విశాలమైనదీ!
    

ఒకరి ఆలోచనలకూ, భావాలకూ ఒక ధోరణిలో అక్షరరూపాన్ని యివ్వడం శైలి. అది వ్యక్తిగతమైనది. ఎవరిధోరణి వారిదే. వారి వారి అభిరుచులనుబట్టీ, నమ్మకాలను బట్టీ, పరిసరాల ప్రభావాన్నిబట్టీ ఒక్కొక్కరికీ ఒకో ధోరణి అలవడుతుంది. ఈ ధోరణిలోనే అతని శైలి ఒదిగి వుంటుంది. శైలి అనేది రచనకు పైపై పూసే పూతకాదు. బయట తగిలించే అలంకారాలు కావు. రచనలో మొదటినుంచీ చివరిదాకా అంతర్లీనంగా ఒదిగిపోయి కలగలిసిపోయిన వాక్య రచనాపద్ధతి. మాటల కూర్పులో, వాక్యం విరుపులో, చెప్పే తీరులో తొంగిచూసే రచయిత వ్యక్తిత్వం. చిత్రకారుడు రేఖల విన్యాసంలో, రంగులమేళనంలో; గాయకుడు రాగప్రసారంలో, స్వరప్రచారంలో; నర్తకి అంగవిన్యాసంలో ప్రకటించే ఒకానొక బాణీ, రచయిత తనను తాను పరిచయం చేసుకొనే ముద్ర.
-శీలా వీర్రాజు