డా|| శంకరమంచి శ్యాంప్రసాద్
9989148305
ఆధునిక వచన సాహిత్య ప్రక్రియల్లో 'కథ' కీలకపాత్ర వహిస్తుంది. కథల్లో సమాజ పోకడలు, మానవ సంబంధాలు, వైఫల్య సాఫల్యాలు, సంఘటనలను, సంఘర్షణలను ఆర్ధ్రంగా చిత్రిస్తున్న వైనాన్ని మనం గమనించవచ్చు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా మారిన జీవన పరిస్థితులలో వచన కవిత, కథ, పాట బహుళ ప్రచారంలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.
సుప్రసిద్ధ నవలా రచయితగా, అలాగే మంచి కథారచయితగా పేరొందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఇటీవల తమ డెబ్భయ్యవ (70) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెలువరించిన కథాసంపుటి ''అస్మదీయులు-తస్మదీయులు'' సామాజిక పరిస్థితులనెన్నింటినో శాస్త్రీయంగా వివరించింది.
నవీన్ నవలా రచయితగానే కాకుండా కథా రచయితగా ఇప్పటి వరకు 80 పైగా కథలు రాశారు. కొన్ని కథల్ని నవీన్ మాత్రమే రాయగలడన్నంత గొప్పగా రాశాడు. అందులో ''బిచ్చగాడు'', ''బ్లాస్ట్‌బ్లాస్ట్'', ''ఎనిమిదో అడుగు'', ''ఫ్రం అనురాధ విత్‌లవ్'', ''బంధితులు'', మొ||నవి చాలా గొప్ప కథలు. కాగా తాజాగా నవీన్ వెలువరించిన ఈ కథాసంపుటిలో పన్నెండు కథలున్నాయి. అందులో ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. ''అస్మదీయులు- తస్మదీయులు'' అన్న కథ పేరునే - ఈ సంపుటికి పెట్టడం వల్ల అదే ప్రధాన కథగా భావించవచ్చు. ఉన్నత, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరకు యువత విదేశాలకు ముఖ్యంగా మన దగ్గరి నుండి అమెరికాకు వెళ్ళడం అనేది మధ్యతరగతి కుటుంబాల్లో కూడా క్రమంగా సాధారణమైపోతున్నది. అంతవరకు బాగానే ఉంది. కాని మానవ సంబంధ విషయాల్లో, ముఖ్యంగా కౌటుంబిక జీవితంలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యాన్ని భూమికగా తీసుకొని నవీన్ రాసిన కథే ఈ 'అస్మదీయులు-తస్మదీయులు'. అంటే నావాళ్లు-నీవాళ్లు అని అర్థం. అమెరికాలో ఉద్యోగపరంగా స్థిరపడిన కూతురు అల్లుణ్ణి చూడడానికై అత్తామామలైన శారద-మధుసూదన్‌లు అమెరికాకు వెళ్ళడం - కూతురైన అనిత - తల్లిదండ్రులు రాకరాక అమెరికాకు వచ్చారని అతిథి మర్యాదలలో లోటు రానీయకుండా చూసుకోవడమే కాకుండా అమెరికాలోని ఎం.ఐ.టి., న్యూయార్క్, లాస్‌ఏంజిల్స్, లిబర్టి స్ట్యాచ్యూ, డిస్నీలాండ్, నయాగరా జలపాతం తదితర ప్రదేవాలన్నింటికి ఒక్కొక్కదాని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ - వారి ప్రయాణాలలో ఎలాంటి అవాంతరం రాకుండా, సెలవుదినాల్లో మాత్రమే కాకుండా భర్తయిన సుజిత్ ఒక సందర్భంలో లీవ్ పెట్టలేక ఆఫీసుకెళ్తానంటే ''వాళ్లు అంత దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు పెడ్తార''ని వాదించడం - తమ కొడుకుతో అమ్మమ్మ తాతయ్యల ముద్దుముచ్చటా తీర్చడం - అన్నీ చేస్తుంది. ఆ రకంగా ఆర్నెళ్లు - ఆమె తల్లిదండ్రులకు ఆరు క్షణాలుగా గడిచిపోయేలా చేస్తుంది.
శారదామధుసూదన్ దంపతులు వెళ్ళొచ్చిన కొద్దిరోజులకు వాళ్ళ వియ్యంకుడైన పురుషోత్తమరావు దంపతులు కూడా అమెరికా వెళ్తారు. అమెరికాకొచ్చిన తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్న అనిత తన అత్తమామలకు నరకం చూపిస్తుంది. కొడుకు దగ్గర ఆరు నెలలుందామని వెళ్ళిన పురుషోత్తమరావు దంపతులు రెండు నెలల్లోనే ఇండియా తిరిగొస్తారు. వాళ్ళ కొడుకు సెలవుపెట్టి వాళ్ళను అమెరికాలోని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తానన్నప్పుడు ''సెలవు ఎలా పెడ్తారండీ. మీరు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నారంటే మీ ఉద్యోగం పోతుంది. నేను, నా బాబు రోడ్డున పడ్డట్టే'' అనడం మొదలైనవన్నీ ఆమె ప్రవర్తనకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. పైగా ''అమెరికాలో కోడలు తిండిపెట్టలేదని దుష్ప్రచారం చేసి నన్ను చులకన చేయడానికా మీరొచ్చింది'' - అని ఏడ్చుకుంటూ రుసరుసలాడ్తూ తన గదిలోకి వెళ్తుంది. చివరకు మనుమనితో ఆడుకుందామన్నా నానమ్మ తాతయ్యల దగ్గరకు పిల్లవాణ్ణి రానివ్వదు. చివరకు కొడుకు కూడా ''భర్త, అత్తామామలు కలిసి నన్ను వేధిస్తున్నారని అది కేసుపెడితే మనం జైలుపాలు కావలసివస్తుంది, పైగా ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయ''ని చెప్పడంతో తామక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని ప్రయాణ తేదీకంటే నాలుగు నెలలు ముందుగానే పురుషోత్తమరావు దంపతులు ఇండియాకు వచ్చేస్తారు. విద్య, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నా సహృదయం, సంస్కారం అన్నవి ఇంకా విద్యావంతులైన యువతీ యువకుల్లో రాలేదని - ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో దూరాన ఉన్న తమ పిల్లల్ని మమతానురాగాలతో చూడడానికి వెళ్ళిన తల్లిదండ్రులకు అక్కడ ఎదురవుతున్న వేదనను, వాళ్ల మూగ బాధను అక్షరీకరించాడు నవీన్. ఇది యువతకు 'కనువిప్పు' కలిగించే కథ. ముఖ్యంగా కోడళ్ళు తమ తల్లిదండ్రులను ఒకలాగ, అత్తమామల్ని మరోలా చూసే విచిత్ర మనస్తత్వాన్ని నవీన్ ఈ కథలో చిత్రించాడు. ఈ కథ ఒక వారపత్రికలో వెలువడినప్పుడు ఈ కథ మీద చాలా చర్చ జరిగింది.
రచయిత ప్రధానంగా వ్యవసాయకుటుంబం నుంచి వచ్చినవాడు. ఎంత కరువు కాటకాలు వచ్చినా, వర్షాధార వ్యవసాయమే అయినా ఇంతకు మునుపు ఈ రంగంలో ఇన్ని చావులు, ఆత్మహత్యలు, మరణాలు లేవు. రైతన్నవాడు ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచినవాడు. మరి అటువంటి రైతు ఆత్మహత్యలు ఎందుకు ఈనాడు సర్వసాధారణమైపోయాయి - ఈ విషయాన్ని ఇతివృత్తంగా నవీన్ రాసిన ముఖ్య కథే ''ఆత్మహత్యలా? హత్యలా'' అన్న కథ. ఇందులో సత్తయ్య, గౌరమ్మ దంపతులు. తండ్రి చనిపోయిన తర్వాత సత్తయ్యకు పాలుగా వచ్చిన అయిదెకరాల భూమిలో క్రొత్త పద్ధతులలో, కొత్త పంటలు వేసి - లాభార్జన చేయొచ్చునని తలచి తోటి మోతుబరి రైతు ఇచ్చిన సలహాతో 'ప్రత్తి' సేద్యానికై బ్యాంకు కల్పించిన ప్రోత్సాహక రుణంగా ఇచ్చిన ఇరవై వేలు తీసుకొని రాత్రింబవళ్లు భార్యాభర్తలు - ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు పాటించి ఎకరాకు పదిహేను క్వింటాళ్ల పత్తి పండించి అనుకున్నట్లుగా ఖర్చులు, బ్యాంకు రుణంగా తీరగా పదివేలు మిగిలాయి. రెండెకరాలు సాగు చేస్తేనే ఇంత ప్రతిఫలం దక్కింది. వచ్చేయేడు నాలుగెకరాలలో వేస్తానని చెప్పడం - దానితో చిన్న, సన్న, మోతుబరి అన్న తేడాలేకుండా ప్రత్తిని సాగు చేయడంతో మార్కెటులో గిట్టుబాటు ధర లేకపోవడం - చేసిన రుణాలకు వడ్డీ పెరగడం - ప్రైవేటు రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మకానికి ప్రభుత్వం బార్లా తలుపు తీయడం వంటి సమస్యతో మార్కెట్‌లో నకిలీ విత్తనాలు, నకిలీ మందులు పొంగిపొర్లి రైతు జీవితాన్ని దుర్భరం చేశాయి. చివరకు మరోసారి భార్యపై నగలు కుదవబెట్టి సాగుచేసినా ఫలితం లేకపోవడం - ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వాళ్లు రెండేళ్లుగా పిల్లల ఫీజులు చెల్లించలేదని వాళ్లను ఇంటికి పంపడం - బ్యాంకు అధికారులు రుణం చెల్లించమని వత్తిడి చేయడం - పరిస్థితి అంతా తలక్రిందులు కావడంతో తను చస్తేనన్న వచ్చే ఎక్స్‌గ్రేషియా డబ్బుతో తన భార్యాపిల్లలు సుఖపడతారని చెప్పి సత్తయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. భార్య గౌరమ్మ రోజు భర్త సమాధి దగ్గర కూర్చొని ఏడ్వడం - చివరకు రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు మరో పార్టీకి రావడం, రైతుల రుణాలు మాఫీ, ఉచిత కరెంటు ఇవ్వడం వంటి పథకాలను అమలు పరచడం తెలుసుకొని ఎంత వద్దన్నా వినక చనిపోయాడు? ''పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరుగ ఉండవు. ఎంత దురదృష్టవంతునికైన మంచిరోజులొస్తాయి'' అన్నా వినక ''పిల్లల్ని నాకు వదిలేసి తను సుఖంగా వెళ్లిపోయాడు'' అని రోదిస్తూ మిగిలిన భూమిని అమ్మి అప్పులన్నీ తీర్చి పిల్లల్ని పట్నానికి తీసుకొని వెళ్లి పెద్ద చదువులు చదివించాలని నిర్ణయించుకొంటుంది. ఈ కథలో రైతు చనిపోయినా మొక్కవోని ధైర్యంతో పరిస్థితుల్ని అధిగమించి, బాధ్యతతో బ్రతుకుపట్ల, జీవితంపట్ల, భవిష్యత్తు పట్ల ఆశావాహ దృక్పథాన్ని కలిగించడం - ఈ కథ సాధించిన ప్రయోజనంగా భావిస్తున్నాను. అలాగే ఒక కాలేజీలో 'అటెండెంట్ పోస్టుకై కన్వీనర్ హోదాలో ఉన్న ప్రిన్సిపాల్, దానికోసం సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒప్పించేందుకు ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఒత్తిడి వచ్చినా బెదరకుండ నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హమైన వ్యక్తిని ఎంపిక చేయడం 'వేణుగోపాల్‌రావు' అనే ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న పాత్ర ద్వారా రచయిత నిరూపించడం - ఈ పరిస్థితుల్ని గమనించినట్లయితే విద్యారంగంలో పరిస్థితులు, విలువలు ఎలా దిగజారు తున్నాయో తెలుస్తుంది.
ఈ కథలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఉద్యోగం కోసం కన్వీనర్, ఎమ్మెల్యే, మంత్రి ద్వారా వత్తిడి తెచ్చిన వ్యక్తి బలరాం నాయక్. కాని వేణుగోపాలరావు రూపొందించిన క్వాలిఫికేషన్స్, రిటెన్‌టెస్ట్, మౌఖిక ఇంటర్వ్యూ - ఈ మూడింటి ద్వారా ఎంపికైన వ్యక్తి విజయకుమార్ నాయక్. బలరాం నాయక్ ఉద్యోగం కోసం ఎంత 'బల' ప్రయోగం చేసినా చివరకు ''విజయం'' విజయ్‌కుమార్‌నే వరించడం - యాదృచ్ఛికం. పేర్ల ద్వారా రచయిత ముందే ఫలితాన్ని సూచించాడా? అనిపిస్తుంది. ఇదే ప్రతిభావంతుడైన రచయిత లక్షణం. నవీన్ చేయి తిరిగిన కథారచయిత కాబట్టి - ఈ ప్రయోజనాన్ని సాధించాడనిపిస్తోంది. ఏమైనా ఇదొక 'కథాకధన నైపుణ్యం'.. చివరకు ఈ కథలో భూక్యానాయక్ వచ్చి వేణుగోపాలరావుతో ''మీరు చాలా న్యాయంగా పనిచేసి మావోనికంటె అన్ని విధాల అర్హుడైన విజయకుమార్‌ను సెలెక్ట్ చేసిండ్రు సార్. ఈ లోకంల మీలాంటోళ్ళు ఉండటం వల్లనే న్యాయమనేది ఈ కొంచెమైనా ఉంటున్నది సారూ!'' అన్న మాటలు కారుచీకటిలో కాంతికిరణాలు. ఈ కథాసంపుటిలో మరో ముఖ్య కథ ''విలువలు''. నేటి యువతపైననే కాకుండా చివరకు స్కూలు పిల్లలపైన దిగజారుతున్న నైతిక విలువల ప్రభావం, సమాజ పోకడల తీరుతెన్నులను, ఈ కథ కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. అరుణ, రామకృష్ణ దంపతుల కొడుకు ప్రదీప్. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్‌కు జీవితం వడ్డించిన విస్తరిలాంటిది కావడంతో స్కూలు నుంచి రాగానే తన గదిలోకి వెళ్ళి రిమోట్‌ను స్వాధీనం చేసుకొని తనకిష్టమైన క్రికెట్‌ను, సినిమాలను, డ్యాన్సులను చూస్తుంటాడు. అరుణ కాస్త సంప్రదాయం, పద్ధతులు కావాలనుకునే మనిషి. తండ్రి కొడుకులు ఆధునిక నాగరికతకు అలవాటయినవారు. ఒకరోజు కొడుకు ఆ స్కూల్లో పనిచేసే దయాకర్ అనే టీచర్ కూతురికి ప్రేమలేఖ రాస్తాడు. దయాకర్ ఆ విషయాన్ని వాళ్ల ఇంట్లో చెప్పాలని వస్తాడు. ప్రదీప్ టీచర్‌ను ఈసడించుకుంటూనే తల్లితో ''మేఘం గర్జించటం, చెట్టు పచ్చగా ఉండటం, టీచర్లు విద్యార్థుల్ని కొట్టడం, తిట్టడం ఎంత సహజమో మేం ప్రేమించడం కూడా అంతే సహజమమ్మా!'' అంటూ తల్లికే వినిపించిన ఘటికుడు. ఇంతవరకు ప్రదీప్ పాత్రపై అసహనం కల్గిన పాఠకులకు ఒక్కక్షణంలో రచయిత కథలో త్రిప్పిన మలుపువల్ల కథ స్వరూపమే, స్వభావమే మారిపోతుంది. ప్రదీప్ అంతవరకు తమ కళ్లఎదుటే పాఠశాలలో జరిగిన అకృత్యాలను వివరిస్తుంటే నిశ్చేష్టులమవుతాం. విద్యార్థులచేత వెట్టిచాకిరి చేయించడం, స్టాఫ్‌రూంలోనే మద్యం సేవించి పేకాట ఆడడం, ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, మరో స్త్రీతో వివాహమైన ఉపాధ్యాయుడు పెళ్ళికాని టీచరమ్మని ప్రేమించానని వెంటపడితే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం, చివరకు ''యథా ఉపాధ్యాయ తథా విద్యార్థి'' అంటూనే - ఉపాధ్యాయుడైన దయాకర్ కూతురు కూడా తనకు లవ్‌లెటర్ రాసిందని కావాలంటే చూపిస్తానంటాడు ప్రదీప్. ఈలోపు అతని తండ్రి తూలుతూ ఇంట్లోకి వస్తాడు. లంచాలను లాంఛనాలుగా భావించే రామకృష్ణ తన హోదాను, అడ్డుపెట్టుకొని అక్రమార్జనకు అలవాటు పడతాడు.డీవిడి ప్లేయర్ ద్వారా అర్థరాత్రి నీలిసినిమాలు చూడవచ్చని, పైగా కార్లకంపెనీలు నెలనెలా చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకొని హ్యుండాయ్, సాంట్రో కార్లను ఇస్తున్నాయని, ఎల్.పి.జి. వల్ల అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా ఏ దేశంలో తయారైన వస్తువులైన మరోదేశంలోకి సులువుగా రావచ్చునని, సౌఖ్యంగా జీవించవచ్చునని హోటల్‌కెళ్ళి బిర్యానీ తిందామని అంటున్న తండ్రి ప్రతి మాటకు ప్రదీప్ తాళం వేస్తుంటాడు. ఇక ఈ ఇంటిలో మార్పు తేవడం, రావడం అసాధ్యమని తలచి ఆ ఇల్లాలు బయటకి వెళ్తుంది. ఇలా కథానిక ఎత్తుగడలో, నిర్వహణలో ముగింపులో వెరసి రచయిత అన్నింట్లో ప్రతిభను కనబరిచాడు.
''ప్రశాంతత''లో గృహమే కదా స్వర్గసీమ! అన్న భావాన్ని చెప్పడం, ఆత్మన్యూనతాభావం అనేది సైకాలజీ సంబంధితమైనదని 'అపవాదు'లో మానసిక జబ్బులకు సైకియాట్రిస్తు దగ్గరకు వెళ్ళడం నేరం కాదని, కాస్తంత కౌన్సిలింగ్ ఇస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, వత్తిడిలో ఉన్న యువత సమస్యల పట్ల తల్లిదండ్రులు, ఆత్మీయుల బాధ్యతల్ని గుర్తుచేస్తారు. తనపై తనకే నమ్మకం లేకపోవడం వలన పలు సందర్భాలలో ఇతరులపై తప్పును నెట్టివేసే ధోరణికి అలవాటుపడడం - చివరకు తన లోపాన్ని గుర్తించడం 'పలాయితుడు' కథలో, త్రుటిలో మహేందర్‌తో పెళ్ళి తప్పిన అపర్ణ అతణ్ణి పెళ్లి చేసుకున్న సువర్ణతో మీవారు ఎలా ఉన్నారంటే - ''ఈమధ్యే, ఆయన పోయారన్నప్పుడు'' - తల్లి అయిన అన్నపూర్ణమ్మ దాన్ని తన కూతురికి 'తలుపుతట్టని అదృష్టం'గా భావించడం, వాస్తు దోషాల్ని సవరించినా ఇంట్లో అన్నీ సమస్యలే రావడం, ఈ విషయమై వామన్‌రావు బంధువులు సిద్ధాంతిని నిలదీస్తే ''ఏది ఎప్పుడు జరగాలని విధి నిర్ణయించిందో అది అప్పుడు అలా జరుగుతుంది. మనమంతా నిమిత్తమాత్రులం'' అంటాడు లక్ష్మణమూర్తి. ఇదేమాట ముందే చెప్పొచ్చుగదా అని అడిగితే ''ఏది ఎప్పుడు ఎలా చెప్పబడాలని విధి నిర్ణయిస్తుందో అది అప్పుడు అలా చెప్పబడ్తుంది'' అని తాపీగా సమాధానం ఇవ్వడంతో తెల్లబోవడం వాళ్లవంతయింది. శాస్త్రీయ దృక్పథం అవసరమని పరోక్షంగా రచయిత ప్రబోధం. అధికారమదంతో తన క్రింద పనిచేసే అటెండెంట్ భార్యను వశపరుచుకొని కులుకుతూ చివరకు ఆ అటెండెంట్ మృతికి కారకుడు కావడం - లైంగిక దోపిడికి ఉదాహరణగా ''పేదవాడి పెళ్ళాం'' కథను చెప్పుకోవచ్చు. అధికారుల వ్యసనాలను బలహీనతల్ని ఆధారంగా చేసుకొని వ్యాపారవర్గం తమ పనుల్ని చక్కబెట్టుకునే వైనాన్ని ''కుళ్ళు'' కథ ద్వారా చాటాడు. ఇలా ఒక్కొక్క సామాజిక సమస్యను తీసుకొని నవీన్ రచించిన ''అస్మదీయులు-తస్మదీయులు'' కథాసంపుటి అందరి అంతరంగాలను ఆవిష్కరిస్తుంది. ఆకర్షిస్తుంది.