ఆరుద్ర బొమ్మలు : బాపు
మనం చదివే చాలా కథలకన్నా, మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి. అయినా మనం పంపించే కథలు ఈ పత్రికలవాళ్లు ప్రచురించరేం? అని మీరెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడూ పడుతున్నారా? పడకండి. ధైర్యం చేతబట్టుకొని, కాళ్లు నిలదొక్కుకోండి.
మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్లు కళ్ళకద్దుకొని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమీ తృణమే ఇచ్చేవారు. ఇప్పుడు పణం ఇస్తున్నారు)
బాగా ఉండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి.
''చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊకొట్టడం వచ్చినదగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడ బలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి?'' అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పట్నుంచీ కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలనీ తహతహ ఉన్నవాళ్లు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.
భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విబుధవరులవల్ల విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేట పరిచారు. ఆహా! దొరికింది కీలకం! ఇదే మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు, ముందు బోలెడంత వినాలి. లాకాయి లూకాయివాళ్ళు చెప్పేదికాదు. విబుధవరులు చెప్పేది. ఆ తరవాత కనాలి. (అప్పుడే కథలు కనకూడదు, ఆమాటకొస్తే కలలూ కనకూడదు. లోకాన్ని చూడాలి) కన్న తరవాత తెలుసుకోవాలి. కన్నవీ, విన్నవీ తెలుసుకున్నవీ కలగలుపు చేసేసి చెప్పాలి. (మామ్మూలుగా కాదు, తేటపరచాలి) అలాచేస్తే అందరూ భాగవతమంత బాగుండే రచనలు చేయగలరు.
''అబ్బే! అంతపెద్ద ఆశలేంలేవు. నేను ఛస్తే బమ్మెర పోతరాజుగారంతవాణ్ణి కాలేను. ఏదో చిన్న కథ రాసి, అది పత్రికలో పడితే నాపేరు చూసి మురిసిపోదామని ముచ్చట పడుతున్నాను'' అంటారా? మీరింక కథలు రాయక్కర్లేదు. మీ ముచ్చట తీర్చడానికి మీరు రాసిన కథ బాగున్నా (మీకు) బాగు లేకపోయినా (అందరికీ) ఏ సంపాదకుడూ ప్రచురించి, ఇతర పాఠకుల్ని ఇబ్బంది పెట్టలేడు. అచ్చులో మీ పేరు చూసుకోడానికి అనేకానేక మార్గాంతరాలున్నాయి. మంచి నిధులకు విరాళాలివ్వండి. మీ పేరు అచ్చులో చూడొచ్చు. లేదా మరో మార్గముంది;
ఈ మార్గం మాత్రం తొక్కకండి. చిక్కులు పడతారు. మొదటి అచ్చులోపడి, తరవాత ఉచ్చులోనూ పడతారు.
పేరు తెచ్చుకోవలసిందే! (చెడ్డ పేరు కాదు. మంచి పేరు) పెద్ద ఆశయాలుంటేనే గాని; చిన్న (మెత్తు) పేరు సైతం రమ్మన్నారాదు. బమ్మెర పోతరాజుగారి ఉపమానమే మళ్ళీ తీసుకుందాం. ఆయన భాగవతం రాశారంటే ఎలా రాశారు? గంటం పట్టుకొని తాటాకుల మీద చెక్కారు. దానికెంత ఓపిక కావాలి. బోలెడంత. ఆయన కున్నంత ప్రజ్ఞ లేకపోయినా, అంత ఓపికా మీకూ ఉంటే మీరూ కథకులవుతారు.
''అభ్యాసం కూసు విద్య'' అన్నారు? పెద్దలు. సాధనమున పనులు సమకూరు 'ధరలోన' అని కూడా వాళ్లే అన్నారని ఎందరెందరో ఉద్ఘాటిస్తున్నారు. మీరు కథకులవడానికి సాధనాలేమిటో ఆలోచిద్దాం.
కథ రాయాలంటే ఏం కావాలి? కథే కావాలి. చెప్పడానికేం లేకపోతే చెప్పేం ప్రయోజనం కొంత మంది గొప్ప కథకులు ఏం లేకపోయినా గొప్ప గొప్పగా చెప్పేస్తారు. వాళ్ళు ఏమిటి వ్రాశారని కాదు. ఎలా వ్రాశారని మనం చదువుతాం. వాళ్ళలాగా చెయ్యి తిరిగాక అలా మీరూ రాయొచ్చుగాని ప్రస్తుతం కథ ఉన్న కథలే రాయండి.
సరే. కథ కావాలి. ఇది ఇంతకుముందు ఎవరూ ఎక్కడా రాయనిదైతే చాలా మంచిది. దేనిమీద రాయడం అని బాధపడకండి. హాస్యమాడేవాళ్లు 'దేనిమీద అని ప్రశ్నేమిటి అందరూ కాగితంమీదే రాస్తారు' అని సమాధానం చెప్తారు.
అబ్బ! గోడమీద కథ రాయడం చాలా కష్టం.
పూర్వం అలంకార శ్రాస్త్రజ్ఞులు ఫలానా ఫలానా విషయాల గురించే వ్రాయాలి, అంటూ అనుశాసనం చేశారు. కాబట్టి ఇబ్బందిలేదు. ఇప్పుడో అన్నీ కావ్య వస్తువులే!
''కుక్క పిల్లా
అగ్గి పుల్లా
సబ్బు బిళ్లా
కాదేదీ కవిత కనర్హం''
అన్నాడు ఆధునిక కవి. దేని గురించైనా మనం రాయొచ్చు. ''ఒక కుక్కపిల్ల సైకిల్‌కింద పడింది. కుయ్యోమని అరిచింది. ఆ అరుపు పక్కనున్న ఆఫీసులోని గుమస్తా విన్నాడు. వింటూ, పరధ్యానంగా హెడ్‌గుమాస్తా పైన కలం విదిలించాడు. సిరాపడింది. హెడ్ గుమాస్తాకి కోపం మొచ్చింది. గద్దించాడు. గుమాస్తా గాభరా పడ్డాడు. సిరాబుడ్డి మీద పడ్డాడు. ఫైలు పాడైంది. అతడు చిరాకుగా ఉన్నాడు. అప్పుడే పెద్ద ఆఫీసరొచ్చాడు. ఆయన హెడ్ గుమాస్తాని పిలిచాడు. చిరాకులో ఆయన వినిపించుకోలేదు'' ఇలా ఎంత గొలుసైనా అల్లుకుపోవచ్చును'' పెద్ద ఆఫీసరు చిన్న గుమాస్తాని తరవాత మెచ్చుకున్నాడు. సిరా ఏ ఫైలు మీద పడి పేజీలని అలికేసిందో, ఆ పేజీలలో దొంగలెక్కలున్నాయి అవి తనిఖీ చేసేవాళ్ళకి అంతు చిక్కలేదు. అనుమానించారు. ఆ ఫైలు పోలీసు లేబరేటరీకి పంపించారు. నేరం బయటపడింది. పెద్ద ఆఫీసరుకి, హెడ్ గుమాస్తాకి శిక్ష పడింది. చిన్న గుమాస్తాకి ప్రమోషనొచ్చింది. అతడు సంతోషంగా యింటికి వెడుతూఉంటే సైకిల్‌కిందపడ్డ కుక్క ఎదురొచ్చింది. నీ మూలాన నాకు ప్రమోషన్ అని దాన్ని అతడు సమీపించి లాలించాడు. అది అతని చెయ్యి కరిచింది. అతడు వెధవకుక్క? అని రాయితో కొట్టాడు. అది పారిపోతూ కారుకిందపడి చచ్చిపోయింది. చిన్న గుమాస్తా దాన్ని చూసి ఏమనుకున్నాడు....?
చూశారా మీకే ఉదాహరణ చెప్పాలని ఇంత కథ అల్లేశాను. ఇలాగ మీరూ అల్లొచ్చు. ఈ కుక్క కథ టూకీగా చెప్పాలంటే ఇలా చెప్పానా ఇదే చిలువలూ, పలవలూ చెక్కి, పెద్ద కథని చేయవచ్చు.
జీవితంలో జరిగిన చిన్న సంఘటన తీసుకొని ఎవరైనా ఇలా రాయవచ్చు. అయితే తీసుకున్న దాన్ని కొత్త కోణంలోంచి చూడాలి. లేదా కొత్త రకంగా చెప్పాలి. పాత సంఘటనల్ని, పాత పద్ధతిలోనే చెప్తే ఎవరిక్కావాలి?
చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, మళ్ళా చెప్పి కొంతమంది హరిదాసులు సైతం రక్తికట్టిస్తారు. విన్నవాళ్లే విని, విన్నవాళ్ళే విని, మళ్ళా మళ్ళా ఆనందించారంటే ఆ చెప్పడంలో గొప్పతనముందని మనం చెప్పుకోవాలి.
చెప్పేతీరు, తేటతెల్లంగా ఉండాలి. సూటిగా ఉండాలి. మన అమ్మమ్మలూ, నాయనమ్మలూ చెప్పగా మనం విన్న మొట్టమొదటి కథ ఒకటి తీసుకుందాం. ''అనగనగా ఒకరాజు. ఆరాజుకేడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులూ వేటకెళ్ళి.... ఈ కథ మీకూ తెలుసు కాబట్టి అంతా రాయను. ఈ కథలో వున్న సుగుణమేమిటి? పాత్రల్ని ప్రవేశపెట్టడంలో డొంక తిరుగుడులేదు. తికమకలేదు. తెలిసిన పాత్రల ద్వారా తెలియని పాత్రల్ని కథకుడు ప్రవేశపెడుతున్నాడు. అదీ తేటతెల్లంగా కథ చెప్పేతీరు.
ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగుణముంది. అది:- కొసమెరుపు. చివర చీమ చెప్పే సమాధానం మనకి నవ్వు పుట్టిస్తుంది. కథ అయిపోయిందనిపిస్తుంది. ప్రతి కథలోనూ ఈ గుణముండాలి. ప్రఖ్యాత కధానిక రచయిత 'వోహెన్రీ' చిట్ట చివర తాను తిప్పదలిచే మలుపు మొట్ట మొదట ఆలోచించుకొని కథ రాసేవాడట. మీరూ అలా ఆలోచించడం ఒక పద్ధతే.
అంతాన్ని ఆదిలోనే వూహించకపోయినా, మధ్యలో వూహించినా మంచిదే. కుంచాన్ని నిలువుగా కొలవడానికి వీల్లేకపోతే, అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు నిలుస్తాయి. ఇందాకా మీకు ఉదాహరణకింద కుక్క కథ చెప్పాను. అందులో కొంత అల్లగానే కొస మెరుపేమిటీ అని అవ్యక్తంగానే ఆలోచించాను. తనకి ఉపకారం చేసిన కుక్కపిల్లకి గుమస్తా కృతజ్ఞత చెప్పడంతో కథ అంతం చేద్దామనుకున్నాను. ఇది మరీ రోటీనుగా ఉందని, అది అతని చెయ్యి కరిచిందని చెప్పాను. ఇప్పుడు అనవసరంగా కుక్కపిల్ల విలన్ అయిపోయిందే అని నాకూ బాధ కలిగింది. కరిచిన కుక్కని ఎవడూ క్షమించడు. అందుకే గుమస్తా దాన్ని కొట్టాడన్నాను. అది కారుకిందపడి చచ్చిపోయిందన్నాను. అప్పుడు గుమస్తా ఏమనుకున్నాడో మీరే వూహించుకోండన్నాను. ఇప్పుడు పాఠకులు కూడా కథలో పాల్గొంటారు.
ఇలా అంచెలవారీగా ఆలోచించి కథ రాయడానికి మీరూ సిద్ధంగా ఉన్నారా? సరే మీతో కలిసి సహాయం చేస్తాను. కథా వస్తువు నెంచుకున్నాక, క్రమాన్ని ఆలోచించుకున్నాక కాగితం మీద పెట్టడమే తరువాయి. కథ చెప్పడానికి భాష కావాలిగా. ఎలాంటి భాషలో చెప్పడం? మనకొచ్చినంత భాషలోనే ఎలా మాట్లాడుకుంటే అలా రాయవచ్చుననే వరం గిడుగు రామమూర్తిగారి ధర్మమా అని లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం.
'నిజం చెప్పడానికి ఉన్నమాటలు చాలు. అబద్దమాడడానికే మాటలకోసం వెతకాలి. అని (బహుశా) చలంగారు (కాబోలు) అన్నారు. తెలియని మాటలు ఉపయోగించవద్దు.
వాడినమాట అక్కడ ఆ సందర్భంలో అవసరమా కాదా అని కూడా ఆలోచించాలి. మాటల్ని తూచి వాడమన్నారు. మాటల్ని తూచడ మెలాగ. ''అవేం ఘన, ద్రవ, వాయు పదార్థాలా తూచడానికి..?'' అనుకోవద్దు. మాటల్ని తూచి వాడగలిగినవాడే సమర్థుడని చెప్పాలి. 'కీ లెరిగి వాత, వీ లెరిగి చేత' అన్నట్టు వాడినమాట అతికినట్టుండాలి. ఆ మాట వాక్యంలో ముందొచ్చినా, వెనకొచ్చినా పనికిరాదు. ఒక ఉదాహరణ చెప్తాను.
''సీతా! నిన్ను ప్రేమిస్తున్నాను.
నీవు నిరాకరిస్తే చచ్చిపోతాను''
ఆమె నిరాకరించింది.
అతడు చచ్చిపోయాడు,
అరవై ఏళ్ళ తరువాత.
ఈ ఉదాహరణలో 'అరవై ఏళ్ళ' తరవాత అన్నమాట ఆఖర్నొస్తేనే జోకు. ' ఆమె నిరాకరించింది. అరవై ఏళ్ళ తరువాత అతడు చచ్చిపోయాడు' అన్నామనుకోండి గమ్మత్తేముంది?
ఇప్పుడు ఆంధ్ర సచిత్ర వారపత్రిక సంపాదకులు తిరస్కరించిన ఒక కథలోంచి మరో ఉదాహరణ యిస్తాను.
''ప్రేమ... ఈ రోజులలో మరీ కేవలం యువతీ యువకులకు అది పర్యాయపదమయింది.......''
పర్యాయపదంకాదు, ఊతపదమైంది అనాలి. రచయిత తాను వాడే మాట ఏమిటో ఆలోచించకుండా వాడేయకూడదు.
తిరస్కరించిన కథలలోంచి ఎన్నైనా ఉదాహరణలు యివ్వవచ్చు. అయితే కథలు ఎలా రాయాలో మీకు చెప్పదలచుకున్నాను గాని, రాయకూడదో కాదు. అందుకే రాసే పద్ధతే చెప్తాను.
సరే! కథా వస్తువు దొరికింది. భాష నిర్ణయించుకున్నాం. ఎత్తుగడ ఎలా చేయడం. ఇది గడ్డు సమస్యే. దీన్నే కృత్యాద్యవస్థ అంటారు. నేను మీకు చెప్పిన కుక్కపిల్ల కథే తీసుకుందాం. దీన్ని ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు. గుమస్తా పేరేమిటి పెడదాం? (గురునాధం అందాం) ఫైళ్లలో కాగితాలు పెట్టడంతో మొదలు పెడదామా? లేదా, రోడ్డుమీద కుక్కపిల్ల తిరుగుతూ ఉండడంతో మొదలెడదామా!
కథలో 'యూనిటీ ఆఫ్ టైం?' అనీ, 'యూనిటీ ఆఫ్ స్పేస్' అనీ రెండు ఉంటాయంటారు. వీటి గురించి ముందు ముందు తెలుసుకోవచ్చు. కథ ఆద్యంతాలలో ఏకత్వం కావాలన్నది ఒక లక్షణం. కథ రోడ్డు మీద మొదలెట్టి రోడ్డు మీద అంతం చెయ్యడం బాగుంటుంది. అందుచేత కుక్కపిల్లతోనే మొదలెడదాం.
రోడ్డుని వర్ణించుదామా! శుభం. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అనవసరపు వర్ణనలు మంచిది కాదు. చదివేవాళ్ళకి విసుగూ, మనకి శ్రమ. నా చిన్నప్పుడో సుభాషితం చదివాను. ఇప్పటికీ మరిచిపోను. అదీ కథలు రాసేవాళ్ళకి సలహాయే.
''గదిలో ఒక పిస్తోలు ఉందని కథలోచెప్తే, కథ అయిపోయేలోపున అది పేలాలి. లేకపోతే అది ఉన్నట్టు చెప్పడం దండుగ'' అని చెఖోవ్(కాబోలు) చెప్పినట్టు నార్లవారు (బహుశా) రాశారు. ఎవరు చెప్పారో నేను మరిచిపోయినా చెప్పింది మరచిపోలేదు.
రోడ్డుని వర్ణిస్తూ, కార్లూ, సైకిళ్లూ చిత్త మొచ్చినట్టూ పోతున్నాయి. అని చెబ్దాం. ఏమంటే కొంతసేపుపోయాక మొదట సైకిల్ కిందా తరువాత కారుకింద కుక్కపిల్లా పడుతుంది. మన కథకి అవసరం కనుక వర్ణిద్దాం.
అయితే ఉత్తవర్ణన ఏం బాగుంటుంది. కొంచెం చమత్కారం కావాలి. ''మహానగరంలో మనుష్యులు కార్లమీద పోతారు. కార్లూ మనుషులమీదపోతాయి'' ''అందాం. ఎలా మొదలెట్టినా పాఠకుడిలో ఉత్సాహం కలిగి కుతూహలం కలిగేటట్లు మొదలెట్టాలి.
(జాన్‌పెన్ అనే) ఒక నవలా రచయిత (టెమ్టేషన్ అనే) ఒక నవల ఇలా మొదలెట్టాడు. ''నేను పుట్టడానికి అర్నెల్ల ముందునుంచీ, నన్ను చంపడానికి హత్యాప్రయత్నాలు జరిగాయి.''
ఈ ఎత్తుగడ ఎంత బాగుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యాప్రయత్నాలు చేసేది వాళ్ళ అమ్మేనన్నాడు. మరికొంత కుతూహలం. ఒక సాంఘిక సమస్య, బోలెడంత పాతకథ అన్నీ వచ్చేశాయి. అయ్యోపాపం అని మొదటే అనిపిస్తుంది.
ఇటువంటి సెంటిమెంటుని కథ ఎత్తుగడలో ఈ రచయిత వాడితే చచ్చి, స్వర్గాన ఉన్న నారాయణబాబు ఒక గేయం చివరలో చచ్చిపోయిన పురిటి కందు యొక్క గాజుకళ్లు 'మా అమ్మే చంపింది! మా అమ్మే చంపింది' అని నేరారోపణ చేస్తున్నట్టు వర్ణించాడు.
కథ మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచన్లనీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ, చెప్పుకుపోవాలి.
ఈ మాత్రం కిటుకులు చెప్పాను కనుక ఇక మీరే ఆలోచించండి. రాయండి. రాసిన కథ పేజీకి ఒక ప్రక్కనే రాయండి. ఇది పత్రికల వాళ్ళసౌకర్యం కోసం (అబ్బే - రెండో ప్రక్క వాళ్లేం రాసుకోరు.)
- రాసిన కథలో కామాలూ, పుల్‌స్టాపులూ మీరే పెట్టడం మంచిది. (సంపాదకుడు కాంపోజిషన్లు దిద్దే ఉపాధ్యాయుడు కాదు.)
- కథని ఈ కొసనుంచీ ఆకొసదాకా పొడుగ్గా రాసేయకండి. పేరాగ్రాపులుండాలి. మరీ ఒక వాక్యం ఒక పేరాగ్రాపు కింద వ్రాయకండి. (పేరాలుగా కథని ఎందుకు విభజించారో కూడా చెప్పమంటారా? అన్నీ చెప్పేస్తే అంతట మీరేం తెలుసుకుంటారు. పది మంచి కథలు చదివి ఊహించండి.)
- రాసిన కథని పత్రికలో అచ్చువెయ్యడానికి మీరేం డబ్బు యివ్వక్కర్లేదు. మీ కథ వేసుకుంటే వాళ్లు మీకిస్తారు (తృణంకాదు, పణం!) అందుచేత 'మేమెంత డబ్బు కట్టాలి?. అని ఉత్తరాలు రాయకండి.
- మీ కథ సంపాదకుడికి నచ్చకపోతే, అది అతడు బుట్ట దాఖలా చేస్తాడు. మీకు తిరిగి పంపించేయాలంటే స్టాంపులు జతచేసి పంపిండి. (ఎంత బరువుకి ఎన్ని స్టాంపులో తెలుసుకని మరీ.)
- మీరు రాసిన కథ మీరే చదివి వినిపిస్తే గాని, తెలియని దస్తూరీలో రాయకండి. (ఒకానొక డాక్టరుగారు పెళ్ళానికి ఉత్తరం రాశాడట. ఈ దస్తూరి తెలియక మందులషాపు కెళ్ళి మందులు కట్టేవాణ్ణి చదవమందట. అతగాడు మనసులోనే చదువుకొని లోపలకెళ్ళి ఒక మందు తీసుకొచ్చి, చేతిలోపెట్టి మూడు రూపాయలు ఖరీదన్నాడట!!)
- రాసిన కథ వెంటనే పత్రికలో పడకపోతే నిరుత్సాహపడకండి. మీ రచనలు ఎన్ని తిరిగి వచ్చేసినా బాధపడకండి (ఆదిలో నా రచనలకూ అదే గతి పట్టింది. అప్పుడు తెగ బాధపడినా, ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏమంటే అవి ఆనాడు అచ్చుపడితే వాటిని ఇవాళ నేనే చదువుకొని సిగ్గు పడతాను)