వాడబడి; పాడుబడి
పనికిరాకుండా పడివున్న
పాతసామాన్ల కోసం
కంఠశోష దండకెందుకని కాబోలు
కొనుగోలు అరుపుల్ని కంఠస్థం పట్టించినటేపు రికార్డును తగిలించుకున్న బళ్ళరిక్షా ఒకటి
పొద్దు పొడుపుతో పాటు మా పుర వీధుల్లో ప్రత్యక్షమై
వ్యాపార సుప్రభాతం ఆలపిస్తోంది
చేతివలలో పడ్డ చేపల్ని
గట్టుమీద దులిపినట్టు
ఇల్ల మూలల్లో ఇరుక్కున్న
చిన్నా; చితక సామాన్లు
పుట్టింటి మీద బెంగ తీరకుండానే
అత్తింటికి అయిష్టంగా బయదెళ్ళే ఆడబిడ్డలల్లే
కిక్కురుమనకుండా
రిక్షా బండి కారాగారంలో బందిఖానా అవుతుంటాయ్
వట్టిపోయిన జీవాల్నెక్కించుకున్న లారీ
కబేళాకు దారితీసినట్టు
ఇన్నాళ్ళూ సాయపడ్డ సామాన్లు
ఏరుదాటాక తగలేసిన తెప్పలవుతుంటాయ్!
కొన ఊపిరిలో కూడా
బిడ్డలశ్రేయస్సును కలవరించే కన్నవాళ్ళల్లే
ఇంటికింకా ఋణపడి వున్నానేమో అన్నట్టు
కాలంచేసి నెలరోజులు కూడా తిరిగి రాకుండానే
మా పక్కింటి యజమానికి ఆసరాగానిల్చి సాయపడ్డ ఊతకర్ర
రిక్షాలోంచి జారిపడి దొర్లుతుంటే
అమ్మోరు జాతరలో తెగిపడ్డ మేక మొండెమల్లే
మొక్కు తీర్చుకోవడానికి పీక నులిమిన కోడిపిల్లల్లే
నేలపడి గిజగిజ కొట్టుకుంటున్నట్టుగా అగుపించేది కాదు
ఉపకారమమకారాల్ని చంపుకుని
వర్తక రక్తపు రుచుల్ని చవి చూసిన
నరపులులు సంచరిస్తున్న నేటికాలంలో
ఇన్నాళ్ళూ
నా ప్రాణపథంగా చూసుకుంటూ వస్తున్న
మా తాతనెత్తిన మోసుకొచ్చిన నాటా రాంగూన్ మానుపెట్టె
బడిపాఠాలతోపాటు
బతుకుపాఠాన్ని బోధించడానికి ఆసనమె ౖనిల్చిన
మా అయ్య చెక్క కుర్చీల మీద
నేడో; రేపో; మా బిడ్డల చూపుసోకి
వర్తక దుమారంలో పడి కొట్టుకు పోతాయోమోనని
సునామీలో చిక్కుకున్న తీరవాసినై
సుడిగాలికి మెలితిరిగిపోతున్న చెట్టుకొమ్మనై
అల్లల్లాడుతూ
క్షణక్షణం భయంభయంగా బ్రతుకెళ్ళదీస్తున్నాను
వర్త 'కబంధం'
కవి:
మోకారత్నరాజు
సెల్ :
9989014767