చిగురించకుండానే చిదిమివేయబడుతున్న
ఆశాంకురాలను ఆదుకోలేక ఆవేదన చెందుతూ
నిర్వీర్యంగా... నిర్జీవంగా... నిశ్శబ్దంగా... ఇలాగే వెళ్ళిపోదామా?
కదలికలు నేర్వకముందే కరచరణాలను కట్టివేయ చూసే
వ్యవస్థీకృత దోపిడీ రాజ్యాలశిబిరాలేవీ తగులబెట్టకుండానే,
కోటలేవీ పగులగొట్టకుండానే
తలవంచుకుంటూ, తలవంపులు సహించుకుంటూ ఇలాగే తరలిపోదామా?
మనగోడు వినని దొరలకు గొడుగులెత్తుతూ,
స్వీయ అభిమతానికి ఆత్మాభిమానానికి, అభిరుచికీ
విలువలేని విఫలమైన బ్రతుకు వెళ్ళదీస్తూ
చిరునవ్వు చిరువెల్గునూ చేరనీయని
విషాదకరమైన చీకటిలో చితుకుతూ
నిరాశతో... నిట్టూర్పులతో....నిరర్థకంగా... ఇలాగే నిష్క్రమిద్దామా?
నీడలనుండి నిర్వాసితులమౌతూ, పీడలలో నిర్బంధితమౌతూ,
వంశపారంపర్య దుఃఖాగ్ని వలయాలలో నిర్దహితమౌతూ,
బంటులుగానే... బానిసలుగానే..
బాధితులుగానే... బలిజీవులుగానే..... వడలిపోదామా?
అనుదినం అడలుతూ.... మూలాలనుండి సడలుతూ... వెడలిపోదామా..?
లేక... అలా కాక...
ఆత్మాహుతి చేసుకుంటున్న ఆశయాలనన్నింటినీ బ్రతికించుకుంటూ,
నిద్రాణమైవున్న నిజశక్తులనన్నింటినీ మేల్కొలుపుకుంటూ,
చెదరిపోయిన సమానులందరినీ సమీకరించుకుంటూ,
సన్నగిల్లిన చైతన్యాన్ని క్రోడీకరించుకుంటూ,
నిజమైన జీవితేచ్ఛను నిబిడీకరించుకుంటూ
ఇప్పుడే... ఒక్కసారి.. అమాంతంగా....
ప్రబల ప్రభంజనంలా, ధర దద్దరిల్లజేసే కంపనంలా,
పెను ఉప్పెనలా, పెళపెళ కురిసే నిప్పుల వానలా
ఏకకాలంలో నలుదిక్కులనుండీ ఏకీకృతమౌతూ
విద్రోహులు మట్టి కఱచేలా విప్లవిద్దామా?
నిర్భయంగా, నిర్విఘ్నంగా, నిర్దిష్టంగా,
నిర్దాక్షిణ్యంగా, నిర్ఘాంతంలా వినాశకారులపై విరుచుకు పడదామా.?
ఏమి చేద్దాం ?
కవి:
గోపినాథరావు ఎరుకలపూడి
సెల్ :
98482 93119