కవి:
ఎల్. సుజాత
ఒక వైపు పట్టుచీరల సింగారాల కేరింతలు
మరోవైపు మానమర్యాదలకై చిరుగుపాతలతో వెతలు
మహిళా దినోత్సవమా ఎక్కడమ్మా నువ్వు
ఒకవైపు కేకుల కత్తిరింపుల సంతోషాల హేలలుమరోవైపు బిడ్డల కళ్ళల్లో కడుపుల్లో ఆకలిమంటలు
మహిళాదినోత్సవమా మరి ఎక్కడమ్మా నువ్వు....
ఒకవైపు అంతర్జాతీయ అంగట్లో అందచందాల ప్రదర్శనలు
మరోవైపు గట్టుమీది పసిబిడ్డకు పాలివ్వలేని అసహాయుల ఆవేదనలు
మహిళాదినోత్సవమా ఎక్కడమ్మా నువ్వు
పేద - ధనిక భేదం పోయిననాడు
స్త్రీ ఒక అంగడిసరుకు అవ్వనినాడు
ఆదర్శాల ముళ్ళకిరీటాలు స్త్రీల నెత్తుల మీంచి తొలగిన నాడు
వేదికల మీద కాకుండా ప్రతిఇంటా సమత విలసిల్లిననాడు
మహిళాదినోత్సవమా!
అంతటా నీవే