కవి:
ములుగు లక్ష్మిమైథిలి
సెల్ :
94416 85293
అది ఒక రహదారి
ఎన్నో శతాబ్దాల చరితగల దారి
ఎలా వెళ్ళాలో? ఎన్ని మైళ్ళు వెళ్ళాలో
ముళ్ళు, రాళ్ళు ఏరివేస్తూ
అడుగులో అడుగు వేసుకుంటూ
ఒక్కో మజిలి దాటుకుంటూ
గమ్యం వైపు అలుపు లేక సాగిపోవాలి
చీకటి దారులు వదిలివేకువ దారుల వెంట పయనించాలి
అహంభావంతో కాదు
ఆత్మవిశ్వాసంతో... అకుంఠితదీక్షతో
ఎన్ని పెళ్ళి ఊరేగింపులు.. చావు ఊరేగింపులు జరిగినా...
స్థిత ప్రజ్ఞలా ఉంటుంది ఈ రస్తా...
ఓ చెట్టుకింద ముసలమ్మ
ఆకలంటు అరచి, అరచి సొమ్మసిల్లింది
అయినా.. తనకేమి పట్టని లోకం
ఈ దారిలో మహాత్ముల పాదముద్రలలో
దివ్య సందేశాల మహితత్వాన్ని ఆపాదించుకొని
నన్ను నేను శోధించుకుంటూ
సాగిస్తున్న తరుణం
ఎన్ని యోజనాలు నడిచినా
ఎన్ని యోచనలు చేసినా...
ఒక లక్ష్యం సాధించే దిశగా నా భవితవ్యం.