అక్షరచరాలు

కవి: 
చల్లగాలి బాబూరావు
సెల్ : 
09941469728

కాలం దాస్తున్న
ప్రశ్నావళి మీద
నేనొక నిశబ్దపు సంతకాన్నై
జ్వలిస్తూ... జ్వలిస్తూనే వున్నప్పుడు
అక్షరంనా ప్రక్కనే కూర్చొని
మనస్సులోని వేదనల్ని మరుగుజేస్తూ
నాతో బలే పసందుగ
స్నేహ వారధికి చేయి అందిస్తుంది
ప్రతి అక్షరం
ఒక సమూహాపు ప్రతిబింబమే
నిరంతరం ప్రవాహశక్తియై
సైనిక దళంలా
కవాతు చేస్తూ కనిపిస్తుంది
కర్షకుని వైపు కరమోడ్చి నిలుస్తుంది
కలవరింతల ఎదలో
గద్గదస్వరమై నినదిస్తుంది
ఆవేశకావేశాలపై
అవినీతి అజెండాలపై
అక్షర సమరమై ఆహుతుల్ని వెదజల్లుతుంది
తడారిన గొంతులోంచి
తన్నుకొచ్చిన పాటలా
తన్మయత్వంలోంచి
దూసుకొచ్చిన స్వరపేటికలా
ఎదలోతులోంచి ఎగజిమ్మిన లావాలా
అపజయాల అచేతనంల్లోంచి
ఆత్మవిష్కరణ జరిగినప్పుడు
అక్షరసమూహం ఆనంద డోలికలూగుతూ
చీకటి తెరల్ని చీల్చెందుకు
వెలుగుల హృదయాల వెతల్ని మాన్పెందుకు
విప్లవాక్షరమై వికసిస్తూనే వుంటుంది