చివరి వసంతం
అక్కడ..
ఆ ఆవరణలో వున్న తోట
ఎప్పుడూ నవ్వుతూ వుండేది
అతడి కళ్లలో ఆనందమై
కదులుతూ వుండేది
అద్భుతంగా అక్కడి పువ్వులు
విచ్చుకున్న పూట..
వెన్నెల కుప్పలు రాసిపోసినట్లుండేది
కొమ్మలకు కట్టిన రెమ్మల ఊయలలు..
ఆకుపచ్చని అలల్లా ఎగసిపడేవి
ఆ తోట మధ్యలో అతడు
ఒంటరిగా కూర్చొనేవాడు
మరపురాని తన వికత గతాన్ని
అంతర్లీనంగా ప్రవహించే
నైరాశ్యపు చీకటిని
కాసేపు అలా..
కాలానికి వదిలేసి
అతడా పూల పరిమళాలతో
సహవాసం చేసేవాడు
గాలి వేసే వీలలను
కొత్త ఉత్సుకతతో ఆలకించేవాడు