మద్యంపై పోరాటం కాళ్ళకూరి 'మధుసేవ'నాటకం
డా|| జోస్యుల కృష్ణబాబు
98664 54340
మద్యరస మనుకార్చిచ్చు మానవుడను
తరువునకు సోకినంతనే తత్తదవయ
వమ్ములనెడి కొమ్మలతోడవమ్ము చేసి
బుద్ధియను చేవతో గూడ బుగ్గి సేయు! అంటూ మద్యపాన వ్యవసనంపై పదునైన బాణాన్ని ఎక్కుపెట్టారు కాళ్ళకూరి నారాయణరావు. సమాజాన్ని ప్రభావితం చెయ్యాలంటే శ్రవ్యం కంటే దృశ్యం గొప్పదని ఆయన భావించారు. అందుకే ఆనాటి (ఈనాటికి కూడా) సమాజాన్ని పట్టి పీడించే మూడు సామాజిక సమస్యలపై మూడు పదునైన అస్త్రాల్ని ఆయన ప్రయోగించారు.
వేశ్యావృత్తి, వేశ్యాలోలత వల్ల కలిగే అనర్ధాల్ని వివరిస్తూ చింతామణి నాటకాన్ని, వరకట్న దురాచారం వల్ల కలిగే కష్ట నష్టాల్ని వివరిస్తూ వర విక్రయాన్ని, మద్యం రక్కసి కోరల్లో చిక్కి కొంపలను ఆరోగ్యాన్ని గుల్లచేసికొనే వారి జీవితాల్లోని విషాదాన్ని గూర్చి మధుసేవ నాటకం ద్వారాను కాళ్ళకూరి చాలా బలంగా చిత్రీకరించారు.
అయితే ప్రదర్శన విషయానికి వస్తే చింతామణి నాటకం ఆంధ్రదేశమంతటా ఊరూరా, వాడవాడలా ప్రదర్శితమై ఆబాలగోపాలాన్నీ అలరించింది. వర విక్రయం ప్రదర్శన కంటే కూడా ఎక్కువగా రేడియో నాటికగా అనేకసార్లు ప్రసారమై జన హృదయాల్లో నిలిచిపోయింది. ఈ రెండూ చలన చిత్రాలుగా కూడ వచ్చాయి.