మహానుభూతి కలిగించిన కాలనాళిక
డాక్టర్ తిరునగరి శ్రీనివాస్
84660 53933
చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతిఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని, బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశన పట్టి విశ్లేషించిన నవల రామా చంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ పరంపరల్ని తడిమి విస్తారంగా విశ్లేషించిన తీరు ఈ నవల చదివే పాఠకులకు మహానుభూతిని కలిగిస్తుంది.
వందలాది కన్నీటి జ్ఞాపకాలను అగ్ని చినుకుల్లా కురిపించే సంఘటన క్రమాన్ని కాలనాళికలో చూడొచ్చు. తెలంగాణ ప్రాంతమంతా వేల మంది వీరుల ఆత్మార్పణలతో అగ్నిగోళమై మండి రక్తకాసారమై త్యాగాలకు ప్రతీకగా మారిన చారిత్రక సందర్భాలను ఈ నవల తేటతెల్లం చేసింది. పరాయి దోపిడీకి శతాబ్దాలుగా గురై అణగారి పోయిన తెలంగాణ జనసామాన్యం కంట నిండా పారిన కన్నీటిని బిగబడుతూనే అలుపెరగక జరిపిన పోరాటాల వివరణ కన్పిస్తుంది. వెట్టిచాకిరి, బానిసత్వం, నిస్సహాయత, నీ బాంచెను దొరా బతుకులు, చిత్ర హింసలతో ఇక్కడి మనుషుల జీవితాలు కన్నీటి చెరువులయ్యాయి. అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రతి మనిషీ ఒక ఆయుధమై సాయుధుడిగా మారి ప్రత్యక్ష యుద్ధమే చేశాడు. నిరంతర ప్రతిఘటన మధ్య రక్త సిక్తమైన చరిత్ర చిత్రణలో వీరోచిత దృక్కోణాలు ఎన్నో ఉన్నాయి.