అధ్యయనం, సాధన ద్వారా నానీల సృజన
ఎన్.లహరి
98855 35506
నా పేరు ఎన్.లహరి. హైదరాబాద్. నానీలు నేర్చుకోవడంలో నా స్వీయ అనుభవం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను.
నేను ఇప్పటికే 'అక్షర నేత్రాలు' అనే కవితా సంపుటిని వెలువరించాను. నాకు ఈ 'నానీల' ప్రయాణాన్ని ఆరంభించవలసిందిగా వీటి సృష్టికర్త, నాకు స్వయానా పెదనాన్న గారైన డా.ఎన్. గోపి గారు చెప్పడం జరిగింది. అప్పటిదాకా అడపా దడపా చదవడమే తప్ప.. ఎప్పుడూ రాసే ప్రయత్నమైతే చెయ్యలేదు. పెద్దనాన్న గారి మాట కోసం, తప్పక రాయాలని నిర్ణయించుకున్నాను. వీటిని రాస్తున్న క్రమంలో ఎన్నిసార్లు నిర్దాక్షిణ్యంగా కొట్టివేతలకు గురయ్యాయో మాటల్లో చెప్పలేను. ''ఇలా అధ్యయనం లేకుండా రాయడం వల్ల ఏ రకమైన ప్రయోజనమూ ఉండదు. లోలోతుల్లోకి వెళ్లి, మూలలను స్ప ృశించి, అనుభవాలను అనుభూతుల రూపంలో పలవరించి కలవరిస్తూ రాయడంలో ఉండే.. ఒక రకమైన మమేకస్థితి.. జీవన లోతుల్ని తడుముతుంది.'' అన్న ఒక అపురూపమైన సలహా నన్నొక నానీల కవయిత్రిగా నిలబెట్టింది.