వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి
94400 44922
అనంతపురం జిల్లా, కదిరి. ఊరి పేరు వినగానే గుర్తొచ్చేవి ఖాద్రి నరసింహస్వామి గుడి, వేమన పుట్టిన కటారుపల్లి, మేక మార్కు బీడీలు, విస్తారంగా విత్తే వేరుశెనగ, తెలుగు భాషకు సవితి అనిపించే తురక తెలుగు. ఇరుకు వీధులు. వీధుల్ని అడ్డదిడ్డంగా కలిపే సందుగొందులు, ఆ ఇరుకు వీధుల్లోనే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు, బండ్లు, మనుషులు, ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు. సిగరెట్టు పీకలు, బీడీ ముక్కలు, పేడ లద్దెలు, ఆయిల్ మరకలు, అరటి తొక్కలు, పేకముక్కలు, గోళీ గుండ్లు, కమ్మర్ కట్లు, సమోసాలు, చెకోడీలు అమ్మేవారి అరుపులు. చాలవన్నట్లు పిల్లలూదే పీపీలు, 'చెప్పల్సే మార్ రే సాలేకు', 'తేరి మాకీ' అరుపులు, 'బాగున్నావా అక్కా? మామ బాగున్నాడా'? పలకరింపులు. గోళీలాటలు... జీవన రంగులు వెదజల్లే పేదరికానికి అడ్రస్ లాంటి టౌను.
ఆ టౌనుకు నేడు కొత్త జీవం వచ్చినట్లైంది.